ఏపీ రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు
సాక్షి, హైదరాబాద్: విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాలను కలుపుతూ రాజధాని ప్రాంతం చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు రూపొందించేందుకు అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ రహదారి నిర్మాణాన్ని 183 కిలోమీటర్ల పొడవున ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం రూ.9.700 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
రాజధాని నిర్మాణానికే ఇంతవరకు సాయం అందించని కేంద్రం ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి ఏ మేరకు సహకరిస్తుందనే అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరిలోనే డ్రాఫ్ట్ మ్యాప్ సిద్ధం చేసి, ప్రాథమికంగా డీపీఆర్ నివేదికను కేంద్రానికి పంపింది. ఎనిమిది లేన్లుగా నిర్మించే రహదారి కోసం మొత్తం 4,117 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొంది. జాతీయ రహదారుల ప్రమాణాల మేరకు కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 22.5 ఎకరాల చొప్పున 183 కిలోమీటర్లకు 4,117 ఎకరాలు అవసరమని పేర్కొంది. అయితే, కేంద్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఇటీవలే అన్ని దశల ప్రణాళికలను అందజేసింది. దీనికనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తిస్థాయి నివేదిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్‌అండ్‌బీ, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల శాఖతో పాటు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించింది. రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు సర్వీస్ రోడ్ల నిర్మాణం, రోడ్డు మధ్యలో మొక్కల పెంపకం లాంటి వాటికి అదనంగా ఎంత ఖర్చవుతుందో తెలియజేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
కేంద్ర సాయంపై ఆశలు పెంచుకోకుండా సొంతగానే నిధులు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌హెచ్-5, ఎన్‌హెచ్-9లను కలుపుతూ ఔటర్ రింగురోడ్డు ప్రణాళికను రూపొందిస్తున్నారు. అమరావతి నుంచి మోగులూరు వద్దకు, హనుమాన్ జంక్షన్ నుంచి రామాపురం, తుమ్మలపల్లి, నందివాడ, గుడివాడ మీదుగా పామర్రు, భట్ల పెనమర్రు, కృష్ణానది మీదుగా మళ్లీ గుంటూరు జిల్లాలో ప్రవేశించే విధంగా నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణా నదిపై రెండు భారీ వంతెనలు నిర్మించాల్సి ఉన్నందున జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) సహకారం కోరనున్నారు.