అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు | ap cm chandrababu reviewed on outer ring road sorrounded by new capital amaravati | Sakshi
Sakshi News home page

అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు

Published Wed, Dec 14 2016 4:54 PM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు - Sakshi

అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు

విజయవాడ: సీఆర్‌డీఏ పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశం ప్రధానంగా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లపై  సాగింది. ఈ రహదారులకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ 3 ఆప్షన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు.

తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయరహదారి, విజయవాడ-ముంబై జాతీయ రహదారి, విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారికి అనుసంధానంగా ఉండేలా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై తుది ప్రణాళిక సిద్ధమైతే దీనిపై సవివర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు.

రాజధాని పరిధిలో భూసమీకరణ ప్రక్రియ మొత్తం డిసెంబరు నెలాఖరులోగా ముగుస్తుందని, రెండు గ్రామాలు మినహా దాదాపు అన్నిచోట్లా ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అంతర్జాతీయ విద్యాలయాల కోసం టెండర్లు పిలవగా పేరొందిన సంస్థలు ఆ ప్రక్రియలో పాల్గొన్నాయని చెప్పారు. ముందు విద్యాలయాలు, కళాశాలలు,  ఆస్పత్రులు, నక్షత్ర హోటళ్లు వస్తే నగరాభివృద్ధి శరవేగంతో జరుగుతుందని అన్నారు.

అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని హిల్టన్, మారియట్, లీలా గ్రూపు వంటి అంతర్జాతీయ సంస్థలను కోరాలని సూచించారు. షెట్టీ గ్రూపు, అమృత, విట్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే వచ్చాయని అధికారులు వివరించారు. రాజధానిలో జస్టిస్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి నవ నగరాల అభివృద్ధిపై ఇక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలతో మాట్లాడాలని కోరారు. రానున్న కొద్ది కాలంలో జాతీయ క్రీడలకు అమరావతి వేదికగా నిలిచేలా స్పోర్ట్స్ సిటీని సిద్ధంచేయాలన్నారు.

వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో నిర్మాణంలో వున్న శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణాలు మరో నెల రోజుల వ్యవధిలో పూర్తవుతాయని సీఆర్‌డీఏ అధికారులు చెప్పారు. సచివాలయం లోపల సుందరీకరణ పనులు పూర్తి కావొస్తున్నాయని, పార్కు నిర్మాణం 70 శాతం పూర్తయిందని తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, రాజధాని నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ చెరుకూరి శ్రీధర్, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి సీఎండీ లక్ష్మీపార్ధసారధి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ వీర పాండియన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement