వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటు | capital development committee formed | Sakshi
Sakshi News home page

వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటు

Oct 30 2014 7:57 PM | Updated on Jul 23 2018 7:01 PM

వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటు - Sakshi

వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటు

వీజీటిఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసి, దాని స్థానంలో రాజధాని అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి మండలి ఉపసంఘం ప్రకటించింది.

హైదరాబాద్: వీజీటిఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసి, దాని స్థానంలో రాజధాని అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి మండలి ఉపసంఘం ప్రకటించింది. ఏపి రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఉపసంఘం ఈ రోజు ఇక్కడ సమావేశమైంది.  భూసేకరణకు విధి విధానాలను ఖరారు చేసింది. సమావేశం ముగిసిన తరువాత మంత్రి పత్తిపాటి పుల్లారావు విలేకరులతో మాట్లాడారు. 17 గ్రామాలలో 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. తుళ్లూరు మండలంలో 14 గ్రామాలు, మంగళగిరి మండలంలో మూడు గ్రామాలలో మాత్రమే భూమి సేకరించనున్నట్లు తెలిపారు. కృష్ణా నదికి దక్షిణ భాగాన ఈ గ్రామాలు వస్తాయని చెప్పారు. గ్రామంలో ఒక్క సెంటు భూమిని కూడా తీసుకోవడంలేదన్నారు. ఉన్న గ్రామాలు ఉన్నట్లు ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ వాటిని తరలించం అన్నారు. ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూమిని కూడా సేకరిస్తామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా సాగు చేస్తుంటే వారికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

దాదాపు 21 వేల మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కిందకు వస్తారని తెలిపారు. సూత్రప్రాయంగా రైతులతో మాట్లాడితే సానుకూలత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్కు రైతులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అందరినీ ఒప్పించి భూమి సేకరిస్తామన్నారు. భూమి సేకరించిన తరువాత  ఎకరాకు 25వేల రూపాయల చొప్పున పది సంవత్సరాల పాటు రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఒక్కో ఎకరం అభివృద్ధికి 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేసిన తరువాత రైతుకు ఎకరాకు వెయ్యి గజాల భూమి ఇస్తామన్నారు. ఆ తరువాత రైతులకు అనుకూలంగా ఉన్నచోట లాటరీ ద్వారా భూమి ఇస్తామన్నారు. 9 నెలల్లో ఆరు సెక్టార్లలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఒక్కో సెక్టారులో 5వేల ఎకరాల భూమి ఉంటుందని తెలిపారు.

మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో ఆరుగురు మంత్రులతోపాటు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement