పత్తిపై తెగుళ్లతో పరేషాన్
యాచారం: పత్తి పంటపై తెగుళ్లతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రోజుల వ్యవధిలోనే మొక్కలు వాడిపోయి, నేలవాలుతుండటంతో జీర్ణించుకోలేక పోతున్నారు. అదనులో వర్షాలు లేక ఆలస్యంగా విత్తనాలు విత్తారు. కురిసిన కొద్దిపాటి వర్షాలకు మొక్కలు ఎదుగుతున్న దశలో తెగుళ్లు సోకి ఎండిపోతుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. మండలంలోని తమ్మలోనిగూడ, యాచారం, నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో పంటపై తెగుళ్ల కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయి.
గత వారం రోజులుగా కురిసిన కొద్దిపాటి వర్షాలతో ప్రాణం పోసుకున్నాయి. ఈ దశలో పత్తి మొక్కలు వాడిపోవడం, నేల వాలిపోవడంతో రైతుల్లో బెంగ పట్టుకుంది. కొన్ని గ్రామాల్లో రోహిణీ కార్తెలో విత్తిన పత్తి ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. కాగా.. రెండు మూడు రోజుల వ్యవధిలోనే పంటలో పలు మార్పులు వస్తుండటంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.