కబ్జాపై కన్నెర్ర
చెరువు ఆక్రమణపై కాపుశెట్టివానిపాలెం గ్రామస్తుల ఆందోళన
విజయనగరం-అనకాపల్లి రహదారిపై బైఠాయింపు.. ట్రాఫిక్ జామ్
అనకాపల్లిరూరల్: అనకాపల్లి మండలంలోని రేబాక పరిధిలో ఉన్న కాపుశెట్టివానిపాలెంలో చెరువు కబ్జాపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయనగరం-అనకాపల్లి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామంలో 13.72 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని, చెరువును ఆనుకుని ఓ వ్యక్తి క్రషర్‌ను నిర్విహ స్తూ చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు స్థలాన్ని సొంత జాగా కింద పాస్‌బుక్, అడంగల్ సృష్టించినట్లు పేర్కొన్నారు. విజయనగరం రాజులు దానంగా ఇచ్చిన భూమిలో చెరువు ఉందని, చెరువు స్థలంపై క్రయ, విక్రయాలకు ఎలాంటి ఆస్కారం లేదని, గతంలో ఈ చెరువులో ఉపాధి పనులు కూడా జరిగాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అది జిరాయితీ భూమి అయితే అప్పట్లో ఉపాధి పనులు ఎందుకు నిర్వహించారో చెప్పాలని ప్రశ్నించారు. చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. ఆ చెరువును కప్పివేస్తే భూములన్నీ బీడువారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో అక్కడ నుంచి గ్రామస్తులు నేరుగా రెండు లారీల్లో తహసీల్దారును కలిసేందుకు అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడకు వెళ్లి ధర్నా చేయగా తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా అలజడి నెలకొంది.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామీణ పోలీసులు పహారా కాశారు. తర్వాత తహశీల్దార్ కృష్ణమూర్తి వచ్చి కాపుశెట్టివానిపాలెం గ్రామస్తులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళనలో గ్రామస్తులు మంత్రి సత్యనారాయణ, కాపుశెట్టి అర్జునరావు, కె.రమణబాబు, బొద్దపు కోటేశ్వరరావు, కరణం నాగసాయిరాం, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.