సమస్యల పరిష్కారంలో విఫలం
రేబల్లె(మేళ్లచెర్వు) : పులిచింతల మనక గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మండలంలోని రేబల్లె గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పులిచింతల ముంపు గ్రామాల వారికి పునరావాసం కల్పించేందుకు రూ. 565 కోట్లు ప్రకటించిందన్నారు. వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 460 కోట్లకు పైగా ఇప్పించినట్లు పేర్కొన్నారు. మిగిలి ఉన్న వంద కోట్ల రూపాయలు ఇప్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి 27 నెలల కాలం గడిచినా కూడా ఇప్పించలేక పోయారన్నారు. తమ్మవరంలో 55 కుటుంబాలకు, రేబల్లెలో 400 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఫోన్ ద్వారా విన్నవించారు. పులిచింతల మునక ప్రజలకు రావాల్సిన ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, నష్టపరిహారం అందించే వరకూ వారి తరపున పోరాడతామన్నారు. ఈ సమావేశంలో కాకునూరి భాస్కర్‌రెడ్డి, కర్నె ప్రతాపరెడ్డి, నాగిరెడ్డి, మోర్తాల వెంకటరెడ్డి, జె.గురవయ్య యాదవ్, జాలాది వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరెడ్డి, జక్కుల శంభయ్య, రామచంద్రయ్య, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.