‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’మూవీ రివ్యూ
టైటిల్: రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం
నటీనటులు: ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి తదితరులు
నిర్మాణ సంస్థ: వారధి క్రియేషన్స్ ప్రై.లి.
దర్శకత్వం: జైదీప్ విష్ణు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అర్పుల
ఎడిటింగ్: జైదీప్ విష్ణు
విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023
కథేంటేంటే..
ఈ సినిమా కథంతా తుపాకులగూడెం అనే ఓ గ్రామం చుటూ తిరుగుతుంది. నక్సలైట్ల సమస్యను తగ్గించడానికి కేంద్ర హోంమంత్రి ఓ స్కీం ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం సరెండర్ అయిన నక్సలైట్లకు మూడు లక్షల రూపాయలు, పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, అందుకు గాను తక్షణమే 100 మంది నక్సలైట్లను లొంగిపోయేలా ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఆదేశాలు అందుతాయి. దీంతో పోలీసులు ఈ పనిని ఏజెన్సీ ఏరియాకు చెందిన బ్రోకర్‌కి అప్పగిస్తాడు. ఈ విషయాన్ని ఏజెన్సీ మొత్తం దొరలా ఫీలయ్యే రాజన్న(ప్రవీణ్) దృష్టికి తీసుకుకెళ్లగా.. అతను తన అనుచరుడు కుమార్(శ్రీకాంత్ రాథోడ్)కు చెబుతాడు. ప్రభుత్వ ఉద్యోగం అనేసరికి అతనితో పాటు తుపాకులగూడెంలోని ప్రజలంతా నక్సలైట్లుగా లొంగిపోవడానికి ముందుకు వస్తారు. అయితే ఉద్యోగం కావాలంటే తలా ఒక లక్ష ఇవ్వాలని బ్రోకర్ కండీషన్ పెట్టడంతో అప్పు చేసి మరీ డబ్బులు కడతారు. మరి నిజంగానే ఈ 100 మందికి పోలీసు ఉద్యోగాలు వచ్చాయా? కుమార్ మాటలు నమ్మి నక్సలైట్లగా లొంగిపోవడానికి సిద్ధపడిన తర్వాత తుపాకులగూడెం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? కుమార్, మమతల ప్రేమ కథ ఏంటి? ఊరి బాగు కోసం ప్రయత్నించిన క్రాంతి ఎవరు? రాజన్నతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
అడవి నేపథ్యంలో సాగే ఓ గూడెం ప్రజల కథ ఇది. 100 మంది అమాయకపు గిరిజన ప్రజలను ఓ బ్రోకర్ ఎలా మోసం చేశాడు? పోలీసులకు, నక్సటైట్లకు మధ్య జరుగుతున్న పోరులో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది అద్భుతమైన కథ అని చెప్పలేం కానీ.. చూసినంత సేపు బోర్ కొట్టకుండా కామెడీగా సాగుతుంది. కుమార్, మమత లవ్‌స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే కుసుమ ఎవరనే విషయాన్ని చివరి వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు దర్శకుడు. ఊరి బాగుకోసం పాటుపడిన తన అన్న క్రాంతిపై పడిన మోసగాడు అనే నిందను తొలగించడానికి రాజన్న చేసే ప్రయత్నం మెప్పిస్తుంది. నటీనటులంతా కొత్త వాళ్లు అయినా సరే మంచి ఔట్పుట్ తెప్పించుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించిన వారంతా కొత్తవారే.. అయినప్పటికీ చక్కగా నటించారు. కుమార్ పాత్రకి శ్రీకాంత్ రాథోడ్ న్యాయం చేశాడు. ఈయన పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే యువకుడి పాత్ర తనది. తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. రాజన్నగా నటించిన ప్రవీణ్.. అడవిలో వచ్చే యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. క్రాంతిగా సురంజిత్, కుమార్ లవర్ మమతగా జయత్రి, శివన్నగా శివరాంలతో పాటు శరత్, వంశీ, వినీత్, విజయ్, కిషోర్, జ్ఞానేశ్వర్, రాజశేఖర్, మ్యాగీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమా ప్రధాన బలం మణిశర్మ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు కూడా చక్కగా, కథకి తగ్గట్టుగా ఉన్నాయి. శ్రీకాంత్ అర్పుల సినిమాటోగ్రఫీ, జైదీప్ విష్ణు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.