Receipts
-
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్‌పోర్టల్‌లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్లోడ్ చేయాలి. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన కృష్ణమూర్తి తన 200 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల మేరకు అప్పటి మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ ఫీజు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ.. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న రసీదు తన దగ్గర లేకపోవడంతో అధికారులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని సూచించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరుకు చెందిన ఓ మహిళ తన 150 గజాల స్థలం కోసం 2020లోనే ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన రసీదు లేకపోవడంతో ‘ఎల్ఆర్ఎస్ తెలంగాణ’ వెబ్సైట్ నుంచి పొందేందుకు ప్రయత్నించింది. ఆమెకు సదరు వెబ్సైట్ నుంచి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చేసేదేమీలేక ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.1.12 లక్షలు చెల్లించారు. సాక్షి, హైదరాబాద్: టీఎస్ బీ పాస్‌లో దరఖాస్తు చేసుకొనే వారికి సైతం ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో పెద్ద మొత్తంలో భారం పడుతోంది. గతంలో రూ.1000 చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే 14 శాతం ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు అప్పటి మార్కెట్ ధర ప్రకారం భవన నిర్మాణ రుసుమును చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ చాలా మంది తమ వద్ద అప్పటి రసీదు లేకపోవడం, వాటిని వెబ్సైట్ నుంచే పొందే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అదనంగా చెల్లించాల్సివస్తోంది. స్తంభించిన సేవలు.. ► ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా ఎదురు చూసిన ఎంతో మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నప్పటికీ ఫీజులు మాత్రం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 2020 నాటి మార్కెట్ ధర ప్రకారం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు కూడా తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలా మంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ► నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించకపోవడంతో 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుముతో పాటు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. రసీదు లేని వాళ్లు ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం ఉంది. కానీ కొంతకాలంగా ఆ వెబ్సైట్ సేవలు స్తంభించాయి. ► దరఖాస్తుదారులు ఆన్లైన్లో మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) రావడం లేదు. ఒక్క తుర్కయంజాల్లోనే 45 వేల మందికిపైగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఒక్కో మున్సిపాలిటీ నుంచి ఇలా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ► ఇప్పటికే రెండేళ్లు గడిచిపోవడం, ఎల్ఆర్ఎస్పై సందిగ్ధం నెలకొనడంతో చాలా మంది రసీదులు కోల్పోయారు. ప్రస్తుతం ఇళ్లు కట్టుకొనేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ రసీదు మాత్రం లభించడం లేదు. స్తంభించిన ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సేవలను తిరిగి ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండాపోయింది. (క్లిక్: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. మెయింటెనెన్స్ లేకుంటే ముప్పే!?) వెల్లువలా దరఖాస్తులు.. కోవిడ్ ఉద్ధృతి తీవ్రత సమయంలో ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా వెల్లువలా వచ్చాయి. మొదటి రోజే 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా చివరి రోజుకు 1,81,847 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో మున్సిపాలిటీల నుంచే సుమారు 74 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీల నుంచి మరో 63 వేలకు పై గా అందాయి. మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మరో 43,511 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వా నికి రూ.18.50 కోట్ల ఆదాయం లభించింది. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్ అభివృద్ధి) -
బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు
సాక్షి, మహానంది: భక్తులు స్వామి వారికి కానుకలిస్తే వెంటనే సంబంధిత రసీదును దాతలకు అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దీనిని గమనించి ఉంటాం. అయితే మహానందిలో అధికారులు మాత్రం ఇందుకు భిన్నం. ఏడాది గడుస్తున్నా..దాతలకు రసీదులు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అమ్మవారికి చీర ఇచ్చినా రసీదు వెంటనే ఇవ్వరు...లక్షల విలువ చేసే బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు. పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఓ ఉన్నత ఉద్యోగి, మరో ఇద్దరు చిరుద్యోగులు తమ కనుసన్నల్లోనే అంతా నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం దేవదాయశాఖకు చెందిన అప్రైజర్(బంగారు, వెండి పరీక్షించే నిపుణుడు)తో కాకుండా ప్రైవేటు అప్రైజర్‌తో బంగారు కానుకల నాణ్యత ప్రమాణాలు పరిశీలించడం, అన్నదాన మండపాల్లో తూకాలు వేయడం విమర్శలకు తావిచ్చింది. మహానంది దేవస్థానానికి సుమారు రెండు కిలోల బంగారు, 200 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇన్ని ఆభరణాలున్నా సరైన లాకర్ లేదు. మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు మూలస్థానం శివశంకర శర్మ ఈ ఏడాది జనవరి 13వ తేదీన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి 200 గ్రాముల వెండి వడ్డాణాన్ని అందించారు. 8నెలలు అయినా రసీదును అందించకపోవడం వెనుక పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గాజులపల్లెకు చెందిన మురళీసోదరులు వెండి పళ్లాన్ని అందించగా పదిసార్లు ఫోన్‌చేస్తే గాని రసీదును అందించలేదు. ఈ రెండు సంఘటనలే అధికారుల పర్యవేక్షణ, నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మహానందిలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి ఆలయ వేదపండితులు, అర్చకులు, దేవస్థానం ఉద్యోగులు అందరూ కలిసి 108 స్వర్ణ కమలాలను చేయించారు. తయారు చేయించి ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన దేవస్థానం ఈఓకు అందించారు. కానీ ఆ రోజు ఇచ్చిన స్వర్ణ కమలాలకు సంబంధించిన రసీదులను దేవస్థానం సిబ్బంది బుధవారం అర్చకులకు అందివ్వడం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారికిచ్చిన చీరలెక్కడో? మహానంది దేవస్థానంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి భక్తులు చీరలు సమర్పిస్తుంటారు. మహానందికి చెందిన న్యాయవాది గంగిశెట్టి రాజేశ్వరరావు సుమారు రూ. 12వేల విలువైన చీరను అందించారు. అది ఎక్కడుందో నేటికీ అధికారులు చెప్పలేకున్నారు. ఈ చీరే కాకుండా మరో దాత ఇచ్చిన చీర కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహానంది దేవస్థానంలో టెండరుదారులు వారి బకాయిలు చెల్లించే సమయంలో ఇచ్చే రసీదుల్లో సైతం సూపరింటెండెంట్, ఈఓల సంతకాలు ఉండవు. రూ. వెయ్యి అయినా సరే రూ. 5లక్షలైనా సరే కేవలం గుమస్తా మాత్రమే రసీదుల్లో సంతకాలు చేయడం దేవదాయశాఖ చరిత్రలో ఈ ఆలయంలో మాత్రమే ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పనిచేసే ఉద్యోగులే ఇక్కడ కీలకంగా మారడం, వారి కనుసన్నల్లోనే పాలన నడుస్తుండటం ఇందుకు కారణమని తెలుస్తోంది. -
మందులు తీస్కో..రశీదు అడక్కు!
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): సుప్రీం కోర్టు చెప్పినా, ఎంఐసీ ఆదేశించినా అధిక శాతం డాక్టర్లు వారికి వచ్చిన లిపిలోనే మందులు రాస్తారు. ఆ లిపి అర్థమయ్యే దుకాణంలోనే మందులు కొనాలి. ఇతర దుకాణంలో నిపుణులైన ఫార్మాసిస్టులు మందులు ఇస్తే ఫరవాలేదు. ఫార్మాసిస్టులు కాని వారు విక్రయిస్తేనే ఇబ్బంది. డ్రగ్ రియాక్షన్ వచ్చి ఒక్కోసారి రోగి ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో మందుల కొనుగోలుకు సంబంధించి రశీదు ఉపయోగపడుతుంది. ఇతర మందులు మింగకుండా నియంత్రిస్తుంది. కానీ ఈ రెండు అంశాలు జిల్లాలోని అనేక ఔషధ దుకాణాల్లో జరగడం లేదు. మందులు తీస్కో..రశీదు మాత్రం అడక్కు అనే రీతిలో మందుల విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో హోల్‌సేల్ మందుల దుకాణాలు, ఏజెన్సీలు 400 దాకా ఉన్నాయి. రిటైల్ మెడికల్ అండ్ జనరల్ షాప్‌లు 2వేలకు పైగా ఏర్పాటు చేశారు. ఇవి కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి నగరం, పట్టణాల్లోనే గాక ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, శ్రీశైలం, గూడూరు, మహానంది, ఆలూరు, ఆస్పరి, కౌతాళం, కోసిగి, పాణ్యం, నందికొట్కూరు, పాములపాడు, బనగానపల్లె వంటి మండల, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ రూ.90లక్షలకు పైగా, నెలా రూ.28కోట్ల వరకు వ్యాపారం జరుగుతోందని అంచనా. మందులు కొన్నా రశీదు ఇవ్వరు సాధారణంగా ఏదైనా వస్తువు కొంటే రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చెబుతారు. కొనుగోలు చేసిన ఆ వస్తువు ఎక్కడ కొనుగోలు చేశామో చెప్పడానికి, ఆ వస్తువు నకిలీ, నాణ్యమైనది కాకపోతే పోరాటం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే జిల్లాలోని మెడికల్షాపులో 80 శాతం దుకాణాల్లో రశీదులు ఇవ్వడం లేదు. పెద్ద, కార్పొరేట్ దుకాణాలు మాత్రం తప్పనిసరిగా మందుల రశీదును మందుల వివరాలు, ధరతో కలిపి ఇస్తుంటారు. దీనివల్ల నాణ్యమైన మందులు తీసుకునేందుకు వీలవుతుంది. జిల్లాలోని 70 శాతానికి పైగా మెడికల్‌షాపుల్లో ఫార్మాసిస్టులు ఉండటం లేదు. బి. ఫార్మసి, డి.ఫార్మసి చేసిన వారు వేరే ఉద్యోగం చేస్తూ సర్టిఫికెట్లు మాత్రం మెడికల్‌షాపుల్లో ఉంచుతున్నారు. మందుల దుకాణాల్లో అక్రమా ల గురించి ఔషధ నియంత్రణ అధికారులకు తెలిసినా తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి నామమాత్రపు కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. బిల్లు ఇవ్వని వారిపై ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఫార్మాసిస్టుల పర్యవేక్షణలోనే మెడికల్‌షాపుల్లో మందులు విక్రయించాలి. లైసెన్స్ ఇచ్చే ముందు ఫార్మాసిస్టులను సైతం ఒక యజమానిగా చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి, ఫార్మాసిస్టులు లేకపోతే మూడుసార్లు నోటీసులు ఇస్తాం. అయినా మారకపోతే ఆంధ్రప్రదేశ్ ఫార్మసి కౌన్సిల్ వారికి వారి సర్టిఫికెట్లు రద్దుకు సిఫారసు చేస్తాం. –ఎం. చంద్రశేఖర్‌రావు, అడిషనల్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ -
యాభై వేలు దాటితే... రశీదు ఉండాల్సిందే
నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు రూ.50 వేలకు మించి నగదు ఉండ కూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.50 వేలకంటే నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సమయం కావడంతో రహదారులపై పోలీసులు ప్రతీ వాహనం తనిఖీ చేస్తారు. ఆ సమయంలో ఒక వ్యక్తి వద్ద రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారు అనే రశీదులతో పాటు ఎప్పడు డ్రా చేశారనే పూర్తి వివరాలు కచ్చితంగా ఉండాలి. సరైన రశీదులు లేకుంటే సంబంధించిన నగదును సీజ్ చేసే అధికారం తనిఖీ చేసే అధికారులకు ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించి మళ్లీ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే రశీదులు వెంట పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బంగారు నగల వ్యాపారులు, ఇతర వ్యాపారుల నుంచి ఎవరైనా నగదురూపంలో కాకుండా బ్యాంక్ డీడీ, చెక్‌ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తే మంచిదని ఎన్నికల కమిషన్ సూచిస్తుంది. -
ఇంటద్దె క్లెయిమ్‌లో జాగ్రత్త!
ఉద్యోగస్తులు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించడం.. ఆ మేరకు రశీదులు ఇవ్వడం... ఆ ఇవ్వడం కూడా కేవలం తన యాజమాన్యానికి ఇవ్వటం... యాజమాన్యం ఎలాంటి తనిఖీ లేకుండా తన సొరుగులో పెట్టేసుకోవటం... ఇంటద్దె క్లెయిమ్‌ను అనుమతించటం... ఆ మేరకు ఆదాయం తగ్గింపు... పన్ను భారం తగ్గింపు... ఇదంతా ఇన్నాళ్లూ జరుగుతున్న ప్రహసనం. మనలో మన మాట!! వీటిల్లో ఎన్నెన్నో దొంగ క్లెయిమ్‌లు కూడా ఉంటున్నాయి. అవి... 1. తక్కువ అద్దె ఇచ్చి.. ఎక్కువ మొత్తానికి రశీదు అందజేయటం 2. అసలు ఏ మాత్రం అద్దె చెల్లించకుండా రశీదు సమర్పించటం 3. సొంత ఇంట్లోనే ఉంటూ అద్దె ఇంట్లో ఉన్నట్లు రశీదు ఇవ్వటం 4. తండ్రి లేదా తల్లి ఇంట్లోనో ఉంటూ అద్దె ఇచ్చినట్లు చూపించడం 5. భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ.. ఇద్దరూ రెండు అద్దె రశీదులివ్వటం 6. నకిలీ ఓనర్... లేని ఓనర్ పాత్రను సృష్టించి అద్దె రశీదు ఇవ్వడం. 7. ఏదో ఒక డమ్మీ ఇంటి నంబరుతో రశీదు ఇవ్వడం వంటివి. కంపెనీల యాజమాన్యాలు ఈ క్లెయిమ్‌లను సరిగ్గా వెరిఫై చేయకుండా ఊరుకుంటున్నాయి. సహవాసం వల్లనో, అరకొర సిబ్బంది వల్లనో ఏ కారణం వల్లనో ఇచ్చిన వివరాలు చెక్ చేయటం... ఇచ్చిన రశీదుల్లో నిజమెంత అని గానీ .. పేరు కానీ, ఇంటి నంబరు కానీ, అద్దె మొత్తం గానీ చెక్ చేయడం లేదు. గుడ్డిగా రశీదులు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇటువంటి వాటిమీద నిఘా పెడుతోంది ఐటీ డిపార్ట్మెంటు. అంతే కాకుండా ఈ మధ్య వెలువడిన జడ్జిమెంట్‌లో సారాంశం ఏమిటంటే... అధికారులు హెచ్ఆర్ఏ విషయంలో చెక్ చేయాలని, క్లెయిమ్ నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవాలని, నిజం కాకపోతే నోటీసులు, ట్యాక్సులు, వడ్డీలు.. పెనాల్టీలు మొదలైన రూపాల్లో వడ్డన ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు... అద్దె ఇంట్లోనే ఉంటుంటే ముందుగా అగ్రిమెంటు రాసుకోండి చెక్కు, డీడీ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా అద్దె చెల్లించండి. అద్దె కాకుండా చెల్లించే కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు మొదలైనవి బ్యాంకు ద్వారా చెల్లించండి. తప్పనిసరి పరిస్థితుల్లో నగదు చెల్లిస్తే రూ.1 రెవెన్యూ స్టాంపు అతికించండి. మీరు చెల్లించే అద్దె నెలకి రూ.5,000 దాటితే టీడీఎస్ చేసి, రికవరీ చేసి ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖజానాలో చెల్లించాలి. వ్యవహారానికి సంబంధించి అన్ని కాగితాలు, పే స్లిప్పులు, బ్యాంకు ఖాతాలు, రశీదులు మొదలైనవి భద్రపర్చుకోండి. ఓనర్ పాన్‌కార్డ్ జిరాక్స్ తీసుకోండి. ఇంటి మున్సిపల్ ట్యాక్స్ రశీదులో ఉన్న పేరున్న వ్యక్తి నుంచే రశీదు పొందాలి. ఓనర్షిప్ మారితే సేల్ డీడ్గానీ తీసుకోండి. చాలా మంది దొంగ రశీదులు ఇస్తున్నారు. వ్యవహారం నిజమే కావొచ్చు.. అంటే ఇల్లు, ఇంటద్దె, చెల్లింపు అన్నీ కరెక్టే కావొచ్చు.. కానీ ఓనరు పన్ను భారాన్ని తగ్గించడానికి, బదిలీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తగిన జాగ్రత్త వహించండి. మీరు నిజంగానే అద్దె చెల్లిస్తూ మీ తల్లిదండ్రుల ఇంట్లోనైనా ఉండొచ్చు. కానీ అద్దె చెల్లించండి. దాన్ని అటు మీ తల్లిదండ్రుల ఇన్కమ్ ట్యాక్స్‌లో ఆదాయం కింద చూపించండి. భార్యాభర్తలు ఒకే ఇంట్లో కాపురం చేస్తూ.. ఒకరే అద్దె చెల్లిస్తూ, ఇద్దరూ క్లెయిమ్ చేయకండి. ఒకే ఇంట్లో ఉంటూ.. మీరు వేరు వేరు దొంగ ఇంటి నంబర్లు ఇచ్చి మినహాయింపు పొందే ప్రయత్నం చేయొద్దు.