సాక్షి, కర్నూలు(హాస్పిటల్): సుప్రీం కోర్టు చెప్పినా, ఎంఐసీ ఆదేశించినా అధిక శాతం డాక్టర్లు వారికి వచ్చిన లిపిలోనే మందులు రాస్తారు. ఆ లిపి అర్థమయ్యే దుకాణంలోనే మందులు కొనాలి. ఇతర దుకాణంలో నిపుణులైన ఫార్మాసిస్టులు మందులు ఇస్తే ఫరవాలేదు. ఫార్మాసిస్టులు కాని వారు విక్రయిస్తేనే ఇబ్బంది. డ్రగ్ రియాక్షన్ వచ్చి ఒక్కోసారి రోగి ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో మందుల కొనుగోలుకు సంబంధించి రశీదు ఉపయోగపడుతుంది. ఇతర మందులు మింగకుండా నియంత్రిస్తుంది. కానీ ఈ రెండు అంశాలు జిల్లాలోని అనేక ఔషధ దుకాణాల్లో జరగడం లేదు. మందులు తీస్కో..రశీదు మాత్రం అడక్కు అనే రీతిలో మందుల విక్రయాలు జరుగుతున్నాయి.
జిల్లాలో హోల్‌సేల్ మందుల దుకాణాలు, ఏజెన్సీలు 400 దాకా ఉన్నాయి. రిటైల్ మెడికల్ అండ్ జనరల్ షాప్‌లు 2వేలకు పైగా ఏర్పాటు చేశారు. ఇవి కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి నగరం, పట్టణాల్లోనే గాక ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, శ్రీశైలం, గూడూరు, మహానంది, ఆలూరు, ఆస్పరి, కౌతాళం, కోసిగి, పాణ్యం, నందికొట్కూరు, పాములపాడు, బనగానపల్లె వంటి మండల, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ రూ.90లక్షలకు పైగా, నెలా రూ.28కోట్ల వరకు వ్యాపారం జరుగుతోందని అంచనా.
మందులు కొన్నా రశీదు ఇవ్వరు
సాధారణంగా ఏదైనా వస్తువు కొంటే రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చెబుతారు. కొనుగోలు చేసిన ఆ వస్తువు ఎక్కడ కొనుగోలు చేశామో చెప్పడానికి, ఆ వస్తువు నకిలీ, నాణ్యమైనది కాకపోతే పోరాటం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే జిల్లాలోని మెడికల్‌షాపులో 80 శాతం దుకాణాల్లో రశీదులు ఇవ్వడం లేదు. పెద్ద, కార్పొరేట్ దుకాణాలు మాత్రం తప్పనిసరిగా మందుల రశీదును మందుల వివరాలు, ధరతో కలిపి ఇస్తుంటారు. దీనివల్ల నాణ్యమైన మందులు తీసుకునేందుకు వీలవుతుంది. జిల్లాలోని 70 శాతానికి పైగా మెడికల్‌షాపుల్లో ఫార్మాసిస్టులు ఉండటం లేదు. బి. ఫార్మసి, డి.ఫార్మసి చేసిన వారు వేరే ఉద్యోగం చేస్తూ సర్టిఫికెట్లు మాత్రం మెడికల్‌షాపుల్లో ఉంచుతున్నారు. మందుల దుకాణాల్లో అక్రమా ల గురించి ఔషధ నియంత్రణ అధికారులకు తెలిసినా తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి నామమాత్రపు కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి
వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. బిల్లు ఇవ్వని వారిపై ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఫార్మాసిస్టుల పర్యవేక్షణలోనే మెడికల్‌షాపుల్లో మందులు విక్రయించాలి. లైసెన్స్ ఇచ్చే ముందు ఫార్మాసిస్టులను సైతం ఒక యజమానిగా చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి, ఫార్మాసిస్టులు లేకపోతే మూడుసార్లు నోటీసులు ఇస్తాం. అయినా మారకపోతే ఆంధ్రప్రదేశ్ ఫార్మసి కౌన్సిల్ వారికి వారి సర్టిఫికెట్లు రద్దుకు సిఫారసు చేస్తాం.
–ఎం. చంద్రశేఖర్‌రావు, అడిషనల్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment