2 రోజులు.. రూ.వెయ్యి కోట్లు!
ఆ లోగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకుంటే మురిగినట్లే
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించకుంటే రెండు రోజుల్లో రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులను నష్టపోయే ప్రమాదం నెలకొంది. ఈ లోగా 13వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులను కేంద్రం నుంచి తెచ్చుకోకుంటే రాష్ర్టం రూ.1,050 కోట్లను కోల్పోవాల్సి వస్తుంది.
నేడో రేపో రూ.8,000 కోట్లకు చేరనున్న ఓడీ
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్నాయి. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ ఢిల్లీకి వెళ్లి వినియోగ పత్రాలను సమర్పించడంతో 13 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం సుమారు రూ. 385 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.ఇంకా రూ. 1050 కోట్లు ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రావాల్సి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. సీఎం బాబు ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ఓవర్ డ్రాఫ్ట్లోనే చెల్లింపులకు దిగుతోంది.
మంగళవారం నాటికి సుమారు రూ.8 వేల కోట్ల వరకు ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్లాలని బాబు సూచించడంతో చర్యలకు ఉపక్రమించింది. పీడీ ఖాతాల్లో ఉన్న రూ. 2,500 కోట్లను కూడా బ్యాంకులకు మళ్లించే ఏర్పాట్లు చేసింది. రాజధానికోసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ. 1,500 కోట్లు కేంద్రం నుంచి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.