పరుగుల వరద
కుల్నా: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో పరుగుల వరద కొనసాగుతోంది. రెండు టీమ్ లు పరుగుల వేటలో పోటీ పడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో పాక్ భారీ స్కోరు చేయగా, బంగ్లా టీమ్ దీటుగా జవాబిచ్చింది. 537/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాక్ 628 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్(224) డబుల్ సెంచరీ సాధించాడు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కేయస్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 267 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాదేశ్ తరపున ఏ వికెట్ కైనా ఇతే అత్యధిక భాగస్వామ్యం. ఇక్బాల్(183 బంతుల్లో 138; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇమ్రుల్(185 బంతుల్లో 132; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేవు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 332 పరుగులు చేసింది. పాక్ కంటే బంగ్లా ఇంకా 23 పరుగులు వెనుకబడి ఉంది.
ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 1233 పరుగులు చేశాయి. ఇందులో ఆరు అర్ధసెంచరీలు, 2 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. మొదటి 4 రోజుల ఆటలో 20 వికెట్లు మాత్రమే పడ్డాయి.