కనీవినీ ఎరుగని బంపర్ వసూళ్లు
హైదరాబాద్: సాధారణంగా పన్నలు కట్టడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ, పెద్దనోట్ల రద్దు చేయడం, ఆ తర్వాత రద్దైన పాతనోట్లతోనే పన్నులు చెల్లించడానికి అవకాశం ఇవ్వడంతో ఈ ఆఫర్ను దేశవ్యాప్తంగా ప్రజలు వినియోగించుకున్నారు. దీంతో దేశంలోని నగరాలన్నింటిలోనూ కనీవినీ ఎరుగనిరీతిలో పన్నులు వసూలు అయ్యాయి.
రద్దైన రూ. 500, వెయ్యినోట్లతో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ పన్నులు, కరెంటు, నీటి బిల్లులు కట్టడానికి అనుమతి ఇవ్వడంతో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు పోటెత్తారు. దీంతో ప్రస్తుత గడిచిపోతున్న నవంబర్ నెలలో దేశంలోని నగరాల్లో ఏకంగా 252శాతం పన్ను వసూళ్లు పెరిగాయి. గత ఏడాది నవంబర్లో రూ. 498 కోట్ల పన్నులు మాత్రమే నగరాల్లో వసూలు కాగా.. ఈ ఏడాది ఏకంగా 1722 కోట్ల పన్నులు వసూలు అయ్యాయి. ఇక హైదరాబాద్ నగరం పన్ను వసూళ్ల విషయంలో రికార్డు సృష్టించింది. నగరంలో భారీగా 2500శాతం పన్ను వసూళ్లు పెరిగాయి.
పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీ భారీగా లాభపడిన సంగతి తెలిసిందే. పన్నుల బకాయిలు, సాధారణ బిల్లులను పాత నోట్లతో చెల్లించొచ్చని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించేందుకు నగర వాసులు క్యూ కట్టారు. దీంతో జీహెచ్ఎంసీకి దాదాపు రూ.246.14 కోట్ల ఆదాయం రాగా, జలమండలికి రూ.100కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.