జాన్ హెన్రీ కృషి మరువలేనిది
సుబేదారి, న్యూస్‌లైన్ : రెడ్‌క్రాస్ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో జాన్ హెన్రీ చేసిన కృషి మరువలేనిదని కలెక్టర్ కిషన్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవనం లో గురువారం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ కిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్త సేకరణలో రాష్ట్రంలో నే జిల్లా రెండో స్థానంలో ఉందని, ఈ దఫా మొదటి స్థానం సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
రక్త సేకరణకు ఎన్జీఓ, స్వచ్ఛంద సంస్థలు శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన ఉద్యోగులు, వివిధ సంస్థలకు కలెక్టర్ సర్టిపికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నాయకుడు డాక్టర్ విజ య్‌చందర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ రవీందర్రావు, కోశాధికారి నాగయ్య, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్ గౌడ్, కోశాధికారి రత్నాకర్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి జగన్మోహన్రావు పాల్గొన్నారు. కాగా, కలెక్టర్ కిషన్ స్వయంగా రక్తదానం చేసి ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ శిబిరంలో 240 మంది ఉద్యోగులు, అధికారులు 240 యూని ట్ల రక్తాన్ని దానం చేశారు.