ఎర్రగౌను పిల్ల
కోబావ్ రోడ్ సబ్వే స్టేషన్... షాంఘై (చైనా)... సమయం రాత్రి పదకొండున్నర కావస్తోంది. వేసవి ప్రారంభ రోజులు కావడంతో కాస్త ఉక్కపోతగా ఉంది. ‘‘అబ్బా... ఇప్పుడే ఇంత వేడిగా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో’’... ఖర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ విసుగ్గా అనుకున్నాడు జెమింగ్. టై విప్పేసి జేబులో పెట్టుకున్నాడు. చొక్కా గుండీలు రెండు విప్పేశాడు. ‘‘హమ్మయ్య... ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. ఈ రైలు ఎప్పుడు వస్తుందో ఏమో. అప్పటి వరకూ ఈ హింస తప్పదు’’ అనుకుంటూ బెంచీ మీద కూలబడ్డాడు. స్టేషన్లో జనం పెద్దగా లేరు. దూరంగా ఒక బెంచీ మీద ఓ పెద్ద వయసు వ్యక్తి కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. మరో వైపు ఓ మహిళా పోర్టర్ గచ్చు శుభ్రం చేస్తోంది. ఇక బేరాలు రావన్న ధీమా అనుకుంటా... దుకాణాల్లోనివారు కుర్చీల్లోనే వెనక్కి వాలి కునుకు తీస్తున్నారు.
‘‘ఖర్మ కాకపోతే కారు ఇప్పుడే చెడిపోవాలా? ట్యాక్సీ దొరికినా ఈపాటికి సగం దూరం వెళ్లిపోయేవాడిని. ఈ రైలు కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఉండేది కాదు’’... ఎవరూ లేరులే అన్న ధీమాతో పైకే చిరాకుపడ్డాడు జెమింగ్.
అతడి మాట పూర్తయ్యీ అవ్వడంతో కిలకిలా నవ్విన శబ్దం వినిపించింది. మధురంగా ఉంది ఆ స్వరం. అందుకే వెంటనే తలతిప్పి చూశాడు.
ఎదురుగా ఓ అమ్మాయి నిలబడివుంది. సన్నగా, పొడవుగా, చక్కని శరీరా కృతితో ఉంది. పెదవులు మూసి ఉంచినా కూడా నవ్వుతున్నట్టే ఉన్నాయి. అయస్కాంత శక్తి ఏదో దాగివుందేమో అన్నంత ఆకర్షణీయంగా ఉన్నాయి నయనాలు!
‘‘ఓహ్... ఏమి అందం’’... మనసులోనే అనుకున్నాడు జెమింగ్. పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు ఓ నవ్వు నవ్వాడు.
‘‘మరీ అంత విసుగైతే ఎలా? రైలు తన టైముకి తను వస్తుంది. మీరు ముందొచ్చేసి చిరాకు పడతారెందుకు?’’ అందామె నవ్వుతూ. నవ్వలేక నవ్వాడు జెమింగ్. అదే ఇంకెవరైనా తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడితే మండుకొచ్చి ఉండేది. కానీ అంత అందమైన అమ్మాయి కల్పించుకుని మాట్లాడుతుంటే మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది.
‘‘నో నో. ఇది రైలు మీద చిరాకు కాదు. ఈ స్టేషన్ దగ్గరకు రాగానే నా కారు చెడిపోయింది. ట్యాక్సీ దొరక్క రైల్లో వెళ్దామని వచ్చాను. అనుకోని మార్పుకు కాస్త విసుగనిపించింది అంతే. పైగా నాకు పొద్దునే బిజినెస్ మీటింగ్ ఉంది. ఇప్పుడు త్వరగా వెళ్లకపోతే దానికి ఇబ్బంది’’... సుదీర్ఘ వివరణే ఇచ్చాడు. ‘‘ఐసీ... మీరు బిజినెస్మ్యానా?’’ అంటూ బెంచీ మీద అతని పక్కనే కూర్చుందామె. ఒక్కసారిగా జెమింగ్ ఒళ్లంతా జివ్వుమన్న ఫీలింగ్. అమ్మాయిలు అతనికి కొత్త కాదు. కానీ ఇంత రాత్రివేళ... ఇంతకుముందెప్పుడూ చూడనంత అందమైన అమ్మాయి సాన్నిహిత్యం అతడికి కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఆమెకు దగ్గర కావాలన్న ఆరాటం పెరిగింది.
‘‘అవును. నేను గార్మెంట్స్ బిజినెస్ చేస్తుంటాను. నా పేరు జెమింగ్. మరి మీరు...?’’
‘‘నాపేరు మీజెన్. నేను అన్యాంగ్ నుంచి ఓ ఫంక్షన్ కోసం షాంఘైకి వచ్చాను. నిజానికి రేపు తిరిగి వెళ్లాలి. కానీ మా అమ్మమ్మకి బాలేదని అమ్మ ఫోన్ చేసింది. డాడీ కూడా ఊళ్లో లేరు. అందుకే వెంటనే బయలుదేరిపోయాను. ఈ టైమ్లో ట్రైనే సేఫ్ అనిపించింది.’’
‘‘అలా అనిపించడం మంచిదయ్యింది.’’
‘‘అంటే?’’
‘‘అబ్బే ఏం లేదు. మీకు అలా అనిపించబట్టే స్టేషన్కి వచ్చారు. నాకు కనిపించారు. నా విసుగును పోగొట్టారు. ఇప్పుడు కంపెనీ ఇస్తున్నారు. లేదంటే నేనేమైపోయేవాడిని!’’... సినీ ఫక్కీలో అతడు అన్న తీరుకి ఫక్కున నవ్వింది మీజెన్. ఆ నవ్వును చూడటమే అదృష్టం అన్నట్టుగా రెప్ప వేయకుండా అలానే ఉండిపోయాడు జెమింగ్. అతడి చూపులోని భావం అర్థమై సిగ్గుతో ఆమె కళ్లు వాలిపోయాయి. అప్పటికీ అతడు చూపు తిప్పుకోకపోవడంతో ఇబ్బందిగా అనిపించింది. ‘‘దాహంగా ఉంది. వాటర్ బాటిల్ కొనుక్కొస్తాను’’ అనేసి లేచింది. అతడు సరే అన్నట్టు తలూపాడు. ఆమె చిన్నగా నవ్వి షాపువైపు నడిచింది. నిద్రపోతున్న షాపువాడిని లేపి మంచినీళ్ల బాటిల్ కొనుక్కుంది. వాడు తిరిగిచ్చిన చిల్లరను హ్యాండ్ బ్యాగులో వేసుకుంటూ జెమింగ్ వైపు చూసింది. అంతే... షాకైపోయింది.
జెమింగ్ ప్రవర్తనలో ఏదో తేడా. భయంభయంగా ఎటో చూస్తున్నాడు. అతడి ఒళ్లు కంపిస్తోంది. వద్దు వద్దు అన్నట్టు చేతులు అటూ ఇటూ కంగారుగా తిప్పుతున్నాడు. మధ్య మధ్య ఏదో వెతుక్కుంటున్నాడు. ఏమీ అర్థం కాలేదు మీజెన్కి. ఉన్నచోటే నిలబడి ‘‘జెమింగ్’’ అంటూ గట్టిగా అరిచింది. వెంటనే తల తిప్పి చూశాడు జెమింగ్. అంత దూరం నుంచి కూడా అతడి పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించింది మీజెన్కి. అతడి ఒళ్లు కంపిస్తోంది. కళ్లు భయంతో ఎర్రబడ్డాయి. ముఖం కందిపోయింది. పెదవులు అదురుతున్నాయి. ‘‘మీజెన్... ఆ పిల్ల చూడు ఎలా చూస్తోందో. నావైపే చూస్తోంది. నన్ను పట్టుకుంటోంది. నాకు భయమేస్తోంది’’... జెమింగ్ గొంతు వణుకుతోంది. మాటలు తడబడుతున్నాయి. మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు. ‘‘ఎవరు జెమింగ్... అక్కడ ఎవరూ లేరే’’ అంటూ వడివడిగా అతడివైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది మీజెన్. ‘‘ఎవరూ లేరంటావేంటి? అదిగో... ఆ పిల్ల ఉంది కదా... ఎర్రగౌను వేసుకుంది. నావైపే చూస్తోంది. తన కళ్లు అదోలా ఉన్నాయి. నాకు భయమేస్తోంది మీజెన్. నాకు భయమేస్తోంది’’... అరుస్తున్నాడు జెమింగ్. ‘‘భయపడకు జెమింగ్... వస్తున్నా’’... పరుగందుకుంది మీజెన్. నాలుగు అంగలు వేసేంతలో.... ఎవరో లాగినట్టుగా జెమింగ్ బెంచీ మీదినుంచి కింద పడిపోయాడు. లేవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అతడి వల్ల కావడం లేదు. మెల్లమెల్లగా పట్టాలవైపు జారిపోతున్నాడు. శరీరం అతడి అదుపులో లేదని అర్థమవుతోంది.
అక్కడ ఎవరూ కనిపించడం లేదు కానీ ఎవరో అతడిని లాగుతున్నట్టుగానే అనిపిస్తోంది. భయంతో కేకలు పెడుతున్నాడు. హడలిపోయింది మీజెన్. ‘‘జెమింగ్... జెమింగ్...’’ అని అరుస్తూ పరుగు పెడుతోంది. అతడిని ఎలాగైనా కాపాడాలని తాపత్రయ పడుతోంది. కానీ సమయం అప్పటికే మించిపోయింది. జెమింగ్ వేగంగా వెళ్లి ప్లాట్ఫామ్ మీది నుంచి పట్టాల మీద పడిపోయాడు. వేగంగా వచ్చిన రైలు అతడి దేహాన్ని ఛిద్రం చేసేసింది.
అవాక్కయిపోయింది మీజెన్. అరుద్దామంటే నోరు పెగలడం లేదు. నడుద్దామంటే అడుగులు పడటం లేదు. కదలడానికి సత్తువ సరిపోవడం లేదు. జెమింగ్ని చూడ్డానికి వెళ్దామంటే ధైర్యం చాలడం లేదు. ఉన్నచోటే కుప్పకూలిపోయింది. అప్పటికే వాళ్లిద్దరి అరుపులూ విని అక్కడికి చేరుకున్న షాపువాళ్లు, ఒకళ్లిద్దరు ప్రయాణీకులు మీజెన్ను ఆస్పత్రికి తరలించారు. మర్నాడు స్పృహ వచ్చింది మీజెన్కి. కానీ షాకు వల్ల పోయిన మతి ఎప్పటికీ తిరిగి రాలేదు. ఏం జరిగిందో అర్థం కాక, ఎలా జరిగిందో అంచనా వేయలేక, కళ్లముందే జరిగిన ఘోరాన్ని మర్చిపోలేక పిచ్చిదైపోయింది మీజెన్. అసలింతకీ అక్కడ ఏం జరిగింది? జెమింగ్కి ఎందుకలా అయ్యింది? అతడిని అంతగా భయపెట్టిన ఆ ఎర్రగౌను పిల్ల ఎవరు? అతడిని ఆ పిల్లే చంపిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీజెన్కు తెలియలేదు కానీ, కోబావ్ సబ్వే స్టేషన్ గురించి అవగాహన ఉన్నవారందరికీ తెలుసు!
షాంఘైలోని కోబావ్ సబ్వే స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. కానీ దాని చరిత్ర వింటే మాత్రం గుండె గుభేల్మంటుంది. ఇక్కడ ఎవరూ ఊహించని సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. రైలు ఎక్కుతూ కొందరు జారి పడిపోతుంటారు. రైలు దిగుతూ కొందరు ప్లాట్ఫామ్కీ రైలుకీ మధ్య సందులో పడిపోతారు. కొందరు తీవ్ర గాయాలపాలవుతారు. కొందరు మృత్యు ఒడికి కూడా చేరుకుంటారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే... రైలు వచ్చే సమయానికి ఎవరో లాగినట్టుగా కొందరు వెళ్లి రైలు కింద పడి మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అలా ఎందుకు జరిగింది అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు ఇప్పటి వరకూ.
ఈ స్టేషన్లో రాత్రిపూట చాలామంది దెయ్యాలను చూశారు. ముఖ్యంగా ఎర్రగౌను వేసుకున్న ఓ చిన్నపిల్ల ఎక్కువగా కనిపిస్తుందని, ఆమె చాలా భయాకనంగా ఉంటుందని, ఆమె కళ్లు భీతిగొల్పుతాయని కొందరు తెలిపారు. ఆమె వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని సాక్ష్యం చెప్పినవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆమె అందరినీ ఎందుకు చంపదు అన్న ప్రశ్నకు మాత్రం ఎవ్వరి దగ్గరా సమాధానం లేదు. మరో విషయం ఏమిటంటే... ఒక యువతి ఆత్మ కూడా ఈ స్టేషన్లో చాలామందికి కనిపిస్తూ ఉంటుందట. అది కొన్నేళ్ల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఓ అమ్మాయి ఆత్మ అని, అది ఎవరికీ కీడు చేయదని, కానీ భయపెట్టేలా పెద్ద పెద్దగా నవ్వుతుంటుందని కొందరు సిబ్బంది చెప్పారు. ఒక్కోసారి కొన్ని ఆత్మలు కలిసి సమాధి పెట్టెలను మోసుకెళ్తూ కూడా కనిపించాయని వాళ్లు అన్నారు. ఈ స్టేషన్కి దగ్గర్లో అతి పెద్ద శ్మశానం ఒకటి ఉంది (ఈ స్టేషన్ ఉన్న ప్రాంతంలో కూడా ఒకప్పుడు శ్మశానమే ఉండేదట. సమాధులను తొలగించి మరీ స్టేషన్ను కట్టారని కూడా అంటూ ఉంటారు). అందువల్లే అక్కడి దెయ్యాలన్నీ ఇక్కడికి వస్తుంటాయని కూడా కొందరు చెబుతుంటారు.
కానీ దెయ్యం అన్న మాటను ఎంతమంది నమ్ముతారు? వాటి ఉనికిని, అవి చేసే హంగామాను ఎందరు విశ్వసిస్తారు? అందుకే ఈ ఉదంతాలన్నీ ప్రమాదాలా లేక దెయ్యాల వికృత చేష్టలా అన్న విషయం ఇప్పటికీ తేలలేదు. నేటికీ ఆ స్టేషన్లో రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణీకులు వస్తున్నారు, పోతున్నారు. అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. దెయ్యాలపై చర్చలు నడుస్తుంటాయి. కానీ అవి ఎటూ తేలకుండా సందేహాలుగానే మిగిలిపోతుంటాయి!
- సమీర నేలపూడి