చనిపోయాక కూడా ఎర్రగౌన్లోనే కనిపించేది
మిస్టరీ
సాధారణంగా దెయ్యాలు తెల్ల దుస్తుల్లో కనిపిస్తాయంటారు. కానీ మార్తా ఎర్ర దుస్తుల్లో కనిపించేదట. ఆమెకు ఎరుపు ఇష్టం. ఎప్పుడూ ఎర్ర దుస్తులే వేసుకునేదట. దుప్పటి, దిండు కవరు, కర్టెన్లు కూడా ఎర్రటివే వాడేదట. అందుకేనేమో... చనిపోయాక కూడా ఎర్రగౌన్లోనే కనిపించేది. అందువల్లే ఆమెను రెడ్ లేడీ అంటుంటారు.
‘‘వెల్కమ్ డాళింగ్... రా లోపలికి’’... అంటూ రూమ్మేట్ ఎదురొచ్చి క్యాటీ చేతిలోని లగేజ్ అందుకుంది.
‘‘వారం అయ్యింది నేనీ రూమ్‌లోకి వచ్చి. తోడు ఎవరొస్తారా అని చూస్తున్నా. నువ్వొచ్చావ్’’ అందామె నవ్వుతూ. క్యాటీ నవ్వలేక నవ్వింది. హాస్టల్లో ఉండటం ఇష్టం లేదామెకి. వెనక్కి వెళ్లిపోదామా అని మనసు పీకుతోంది. ముభావంగా మంచమ్మీద కూర్చుంది.
‘‘ఇంటి మీద బెంగా? మొదటి రెండు రోజులూ నేనూ అలానే ఫీలయ్యా.
ఒక్క సారి అలవాటు పడితే బెంగ పోతుంది. ముందు ఫ్రెష్ అవ్వు. డిన్నర్‌కి క్యాంటీన్‌కి వెళ్దాం’’ అందామె అనునయంగా. క్యాటీ కళ్లు తుడుచుకుంది. ‘‘అమ్మ ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చింది. ఇద్దరం ఇక్కడే తిందాం’’ అంది నవ్వలేక నవ్వుతూ. ‘‘ఓకే’’ అందామె భుజాలెగరేస్తూ. ఆమె కలివిడితనం నచ్చింది క్యాటీకి. ‘‘మీ పేరు చెప్పలేదు’’ అంది. ‘‘మార్తా’’ అందామె. ఇద్దరూ డిన్నర్ ముగించి పడకల మీదకు చేరారు.
చప్పున లేచి కూర్చుంది క్యాటీ. చుట్టూ చూసింది. బెడ్ లైట్ లేదేమో... కన్ను పొడుచుకుని చూసినా ఏమీ కనిపించట్లేదు. ‘‘మార్తా.. మార్తా’’ అంది. ‘‘ఏంటి క్యాటీ... పీడకలేమైనా వచ్చిందా’’ అంది మార్తా. ‘‘లేదు. ఎవరో తలుపు కొడుతున్నారు’’... అంది. ‘‘ఎవరూ ఉండ రులే క్యాటీ. పడుకో’’ అంటూ మళ్లీ నిద్ర లోకి జారిపోయింది మార్తా. కానీ క్యాటీ పడుకోలేదు. ఎవరో తలుపు కొడుతు న్నారు. వార్డెన్‌గానీ ఏదైనా చెప్పడానికి వచ్చిందా? వెళ్లి తీస్తే మంచిదేమో!
మంచం దిగింది క్యాటీ. స్విచ్ వేస్తే లైట్ వెలగలేదు. ‘కరెంటు కూడా ఇప్పుడే పోవాలా’ అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎవరూ లేరు. ఆశ్చర్యపోయింది. ఎవరో తలుపు కొట్టారు. ఇప్పుడేమై పోయారు? ఆలోచిస్తూ తలుపు మూయ బోయింది. అంతలో సన్నగా ఏడుపు. ఎవరా అనుకుంటూ చూసింది క్యాటీ. అక్కడే ఓ పక్కగా... ఓ అమ్మాయి మోకాళ్ల మీద తలపెట్టుకుని కూర్చుని ఏడుస్తోంది.
జాలి గొలిపేలా ఉందా ఏడుపు. దగ్గరకు వెళ్లకుండా ఉండలేకపోయింది. ‘‘ఎందుకే డుస్తున్నారు’’ అంది. ‘‘నాకు ఇంటికెళ్లి పోవాలనుంది. నాతో ఎవరూ మాట్లా డటం లేదు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు’’ మరింత గట్టిగా ఏడవసాగిందామె. క్యాటీకి జాలేసింది. ‘‘బాధపడకండి. నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను’’ అంది ప్రేమగా. ఆ మాట వింటూనే వెనక్కి తిరిగిందామె. అంతే... హడలిపోయింది క్యాటీ. ఆమె మార్తా! కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి.
ముఖం వికృతంగా ఉంది. విరబూసివున్న జుత్తు గాలికి ఎగురుతూ భయపెడుతోంది. ఇందాకే తనతో గదిలో మాట్లాడింది. మరి ఇక్కడ? అయినా ఇలా ఉందేంటి?
‘‘నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నేనంటే నీకు అంత ఇష్టమా?’’ అంది మార్తా. ఆ స్వరం భయానకంగా ఉంది. క్యాటీకి వెన్నులోంచి వణుకు వస్తోంది. ఎలాగో కాళ్లలోకి సత్తువ తెచ్చుకుంది. ఒక్క ఉదుటన వార్డెన్ దగ్గరకు పరుగు తీసింది. క్యాటీ చెప్పింది విని.. ‘‘రూమ్మేట్ ఎవరు? నీ రూమ్‌లో ఎవరూ లేరు. మొదట నువ్వే వచ్చావ్’’ అందామె. షాక్‌తో స్పృహ కోల్పోయింది క్యాటీ. ఇక లేవలేదు.
అలబామా (యు.ఎస్.)లోని హంటింగ్డాన్ కాలేజీలో... కొన్ని దశాబ్దాల క్రితం ఈ సంఘటన జరిగింది. అప్పుడే అక్కడ ఓ దెయ్యం తిరుగు తోందన్న నిజం బయటికొచ్చింది. ఆ దెయ్యం ఎవరో కూడా తెలిసింది. ఆమె ఎవరో కాదు... మార్తా! హంటింగ్డాన్ కాలేజీలో చదువు కోడానికి ఊరిని, ఇంటిని, తల్లిదండ్రుల్ని వదిలి వచ్చింది మార్తా. కానీ ఆమెకది ఇష్టం లేదు. ప్రతిరోజూ ఏడుస్తూనే ఉండేది. ఎప్పుడూ మనసు ఇంటిమీదే. సరిగ్గా చదివేది కూడా కాదు. డల్‌గా ఉండే ఆమెతో ఎవరూ స్నేహం చేసేవారు కాదు.
ఆమె రూమ్‌లో ఉండటానికీ ఒప్పుకునే వారు కాదు. కనీసం పన్నెత్తి పలక రించేవారు కాదు. దాంతో రాత్రయితే ఒంటరిగా ఉండలేక గదిగదికీ వెళ్లి తలుపు కొట్టేది. నాతో మాట్లాడండి, స్నేహం చేయండి అని అడిగేది. ఎవరూ పట్టించు కునేవారు కాదు. కుమిలిపోయింది. ఇంటికి వచ్చేస్తాను అంటే ఒప్పుకోని తండ్రిని కన్విన్స్ చేయలేక, ఆ బెంగతో బతకలేక ఆత్మహత్య చేసుకుంది మార్తా.
అక్కడితో ఆమె కథ ముగిసి పోయిందనుకున్నారంతా. కానీ మార్తా ఆత్మ అక్కడక్కడే తిరుగుతోందని ఆమె రూమ్‌లోకి వచ్చిన అమ్మాయి మరణించే వరకూ తెలియలేదు. ఆమె రూమ్‌ని శాశ్వతంగా మూసేశారు. ఆ తర్వాత కూడా మార్తా ఆత్మ ఎందరికో కనిపించింది. కానీ కాలేజీ బిల్డింగ్‌ని రీమోడల్ చేశాక కనిపించడం మానేసింది. ఇక ఈ లోకంలో తనకు చోటు లేదనుకుందో... లేక ఆ లోకంలో ఆమెకో తోడు దొరికిందో!!