'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ గ్యాంగ్..'
ఎర్ర చందనం అక్రమ రవాణాలో వీరప్పన్ అనుచరుల హస్తం ఉండవచ్చనే అనుమానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ చీఫ్ బి ప్రసాదరావు వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ... చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను స్మగ్లర్లు హత్య చేయడం ఆందోళన కలిగిస్తోంది అని ప్రసాదరావు అన్నారు. హత్యలను, సంఘటనలను బట్టి చూస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ గ్యాంగ్ ఉందేమో అనే అనుమానం కలుగుతోంది అని అన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ అనుచరుల పాత్ర ఉందో లేదో అని స్పష్టంగా చెప్పలేము కాని.. అక్రమ కలప రవాణకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లేనని డీజీపీ అన్నారు. అక్రమ కలప రవాణ మాఫియాను అరికట్టేందుకు ఫారెస్ట్ శాఖతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
ఫారెస్ట్ అధికారులతోపాటు, ఆయుధాలు ధరించిన పోలీసులతో చెక్ పోస్ట్ ల వద్ద భారీ నిఘాను పెట్టమాని ప్రసాదరావు ఓప్రశ్నకు సమాధానంగా జవాబిచ్చారు. 2013 సంవత్సరంలో అక్రమ ఎర్రచందనం రవాణా వ్యవహారంలో 3249 మందిని అరెస్ట్ చేసి.. 531 కేసుల్ని నమోదు చేశామని తెలిపారు.