టీడీపీలోకి ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి?
సీఎం రమేష్ ద్వారా బాబుతో మంతనాలు
నేడో,రేపో పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారు
ఆయనతో పాటే ఆయన సోదరుడు, వర్గీయులు
పలమనేరు: జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. జిల్లాకు చెందిన ఇరువురు ముఖ్యనేతలతో పాటు సీఎం రమేష్ ద్వారా ఇప్పటికే చంద్రబాబుతో చర్చించారని, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. నేడో, రేపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న రెడ్డెప్పరెడ్డి కిరణ్ సర్కార్ చొరవ తో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
కిరణ్ రాజీనామా చేశాక జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పరోక్షంగా పనిచేశారు. కానీ ఆ పార్టీలో భవిష్యత్తు ఉండదని భావించి పరోక్షంగా టీడీపీకి మద్దతు పలుకుతూ వచ్చారు. సోమవారం మంచి రోజు కావడంతో ఆ రోజే పార్టీలో చేరనున్నట్టు ఆయన సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. రెడ్డెప్పరెడ్డితో పాటు ఆయన సోదరుడు, నియోజకవర్గంలోని అనుచరులు పలమనేరు పట్టణానికి చెందిన ఇరువురు మైనారిటీ నాయకులు టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది.
ఎమ్మెల్సీ చేరికతో మారనున్న సమీకరణలు
పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా సుభాష్‌చంద్రబోస్ వ్యవహరిస్తున్నారు. రెడ్డెప్పరెడ్డి రాకతో ఇన్చార్జ్ బాధ్యతలు ఆయనకే దక్కుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలోని కొందరు స్థానిక నేతలు రెడ్డెప్పరెడ్డి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎన్నికల్లో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన బోస్ పార్టీకి అండగా ఉండగా ఎమ్మెల్సీని పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరమేమొచ్చిందని అదే పార్టీకి చెందిన కొందరు మధనపడుతున్నారు.