'పల్స్‌పోలియో' విజయవంతానికి ఏర్పాట్లు
రిమ్స్‌క్యాంపస్: జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి కూడా చుక్కలు వేస్తారని చెప్పారు.
డీఎంహెచ్‌వో కార్యాలయంలో పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణపై శనివారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 27,48,177 మంది జనాభా ఉన్నారని, వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,42,897 మంది ఉన్నట్టు చెప్పారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ప్రాంతంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1606 కేంద్రాలు, సంచార కేంద్రాలపై శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు.
పోలియో వ్యాక్సిన్, బ్యానర్ల పంపిణీ 95 శాతం పూర్తయ్యిందన్నారు. హై రిస్క్ ఏరియాను కూడా కవర్ చేసినట్టు చెప్పారు. పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ : 08942-229945 నంబరులో వైద్యశాఖాధికారిని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారుల సెల్ : 9963994336, 9963994337 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లాలో పోలియో సమస్యాత్మాక ప్రాంతాల్లో 5,739 మంది బాలబాలికలను గుర్తించినట్టు చెప్పారు. వారికి చుక్కలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాఖ ప్రాంతీయ సంచాలకులు గోపాలకృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, ఏడీఎం సీహెచ్ శారద, తదితరులు పాల్గొన్నారు.