Reddys Labs
-
ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది : సతీష్ రెడ్డి
-
డబ్ల్యూఈఎఫ్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో డాక్టర్ రెడ్డీస్ ప్లాంటు
న్యూఢిల్లీ: గ్లోబల్ లైట్‌హౌస్ నెట్వర్క్ (జీఎల్ఎన్)లో కొత్తగా 11 ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సైట్లను చేర్చినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ నుంచి దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) హైదరాబాద్ ప్లాంటు, శ్రీసిటీలోని మాండెలీజ్ ఫ్యాక్టరీ, ఇండోర్‌లోని సిప్లా ప్లాంటు ఉన్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి విప్లవాత్మకమైన సాంకేతికతలను ఉపయోగించడంలో ముందుంటున్న 100 పైగా తయారీ సంస్థలు జీఎల్ఎన్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న నాణ్యత ప్రమాణాల అంచనాలను అందుకునేందుకు డీఆర్ఎల్ హైదరాబాద్ ప్లాంటు భారీ స్థాయిలో డిజిటలీకరణ చేపట్టినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. తయారీ వ్యయాలను 43 శాతం మేర తగ్గించుకున్నట్లు పేర్కొంది. పాతికేళ్ల హైదరాబాద్ ప్లాంటుకు డిజిటల్ లైట్‌హౌస్ ఫ్యాక్టరీ హోదా దక్కడం గర్వకారణమని డీఆర్ఎల్ గ్లోబల్ హెడ్ (తయారీ విభాగం) సంజయ్ శర్మ తెలిపారు. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఆటోమేషన్స్ మొదలైన వాటితో శ్రీ సిటీలోని ప్లాంటులో మాండెలీజ్ సంస్థ తయారీ వ్యయాలను 38 శాతం తగ్గించుకుందని, కార్మికుల ఉత్పాదకతను 89 శాతం మేర పెంచుకుందని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. అంతర్జాతీయంగా మాండెలీజ్‌కు ఉన్న ఫ్యాక్టరీలకు ఈ ప్లాంటు ప్రామాణికంగా మారిందని తెలిపింది. లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లోని నాలుగు సంస్థలకు అత్యుత్తమమైన సస్టెయినబిలిటీ లైట్‌హౌస్‌ల హోదా ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. -
హెటెరో కీలక డీల్..మరో రెండు నెలల్లో వ్యాక్సిన్!
మాస్కో/ హైదరాబాద్: దేశీయంగా రష్యన్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తాజాగా పేర్కొంది. తద్వారా ఏడాదికి 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. 2021 మొదట్లో వ్యాక్సిన్ తయారీ ప్రారంభంకావచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆర్డీఐఎఫ్ పేర్కొంది. కాగా.. వ్యాక్సిన్ తయారీకి హెటెరోకు ప్రత్యేకించిన యూనిట్లేకున్నప్పటికీ హైదరాబాద్‌లోగల బయోఫార్మాస్యూటికల్ ప్లాంటులో వ్యాక్సిన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్-వి తయారీకి హెటెరోతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా భారత ప్రజలకు సురక్షితమైన, అత్యంత ప్రభావిత వ్యాక్సిన్‌ను అందించే వీలున్నట్లు ఆర్డీఐఎఫ్ సీఈవో కైరిల్ డిమిత్రేవ్ పేర్కొన్నారు. వేగంగా అందించేందుకు స్పుత్నిక్-విని స్థానికంగా తయారు చేయగలిగితే సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు వీలుంటుందని హెటెరో ల్యాబ్స్ అంతర్జాతీయ మార్కెటింగ్ డైరెక్టర్ బి. మురళీ కృష్ణారెడ్డి ఆర్డీఐఎఫ్తో ఒప్పందం సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు దేశీ క్లినికల్ పరీక్షలు దోహదపడనున్నట్లు తెలియజేశారు. కాగా.. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు 2021 మార్చిలోగా పూర్తికావచ్చని ఇటీవల డాక్టర్ రెడ్డీస్ అంచనా వేసింది. 91.4 శాతం బెలారస్, వెనిజులా తదితర పలుదేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఐఎఫ్ తెలియజేసింది. రష్యాలో 40,000 మందిపై నిర్వహించిన మూడో దశ పరీక్షలలో సానుకూల ఫలితాలు వెలువడినట్లు పేర్కొంది. వీటి రెండో మధ్యంతర డేటా ప్రకారం 91.4 శాతం సత్ఫలితాలు సాధించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో డోసు 10 డాలర్ల(రూ. 740) కంటే తక్కువకు అందించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఎపిడిమియాలజీ, మైక్రోబయాలజీ గమలేయా నేషనల్ సెంటర్ సహకారంతో ఆర్డీఐఎఫ్ స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 120 కోట్ల వ్యాక్సిన్లకు దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీఐఎఫ్ తెలియజేసింది. -
ఆరునెలల్లో ఆక్స్ఫర్డ్ టీకా
లండన్: ఈ యేడాది చివరి నాటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చే అవకాశం ఉందని, ఆరు నెలల్లోపు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రముఖ ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, క్రిస్మస్‌నాటికి అనుమతులొచ్చే అవకాశం ఉందని మీడియా తెలిపింది. వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చిన తరువాత, వృద్ధులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల లోపు అమలు చేయనున్నట్లు ఆ రిపోర్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల్లోపు, లేదా అంతకంటే ముందే ప్రారంభించడానికి ప్రయత్నించేలా చూస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటిగా 65 సంవత్సరాలు పైబడిన వారికి, తరువాత హైరిస్క్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న యువతరానికి ఈ వ్యాక్సిన్‌ని ఇస్తామని, తర్వాత క్రమంలో 50 ఏళ్ళు పైబడిన వారికీ, అలాగే యువతకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రిటిష్ ప్రభుత్వం పది కోట్ల ఆక్స్ఫర్డ్ వ్యాక్సి న్ డోస్‌ల కొనుగోలుకి ఆదేశాలిచ్చినట్లు వారు తెలిపారు. మూడోదశ ప్రయోగాలకు అనుమతివ్వండి: రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన స్పుత్నిక్–వీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరింది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ను భారత్‌లో ప్రయోగించేందుకు, ఉత్పత్తి చేసేందుకు రెడ్డీస్ ల్యాబొరేటరీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న 90 రోజుల తర్వాతా కరోనా వ్యాప్తి కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వారి శరీరంలో కోవిడ్ నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత కూడా వైరస్ ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ ఇన్ అట్లాంటా అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ ఆసుపత్రుల నుంచి రోగుల సమాచారాన్ని సేకరించి సంస్థ విశ్లేషించి చూడగా ఈ విషయం బయటపడింది. వారి ద్వారా ఈ వైరస్ అత్యంత వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని ఆ అధ్యయనం తెలిపింది. -
రియాక్టర్ పేలుడు: యువకుడు మృతి
కొమురవెల్లి: హైదరాబాద్‌లోని రెడ్డి ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ పేలిన ఘటనలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన సార్ల మహేష్ (20) అనే యువకుడు మృతిచెందాడు. ఈ ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ వద్ద మహేష్, మరో ఇద్దరు సోమవారం రాత్రి పనిచేస్తున్న సమయంలో అత్యధిక వేడితో రియాక్టర్ పేలింది. దీంతో అతని ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడగా.. ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మహేష్ కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలి వచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేసినట్లు తెలుస్తోంది.