మాస్కో/ హైదరాబాద్: దేశీయంగా రష్యన్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తాజాగా పేర్కొంది. తద్వారా ఏడాదికి 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. 2021 మొదట్లో వ్యాక్సిన్ తయారీ ప్రారంభంకావచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది. కాగా.. వ్యాక్సిన్ తయారీకి హెటెరోకు ప్రత్యేకించిన యూనిట్‌లేకున్నప్పటికీ హైదరాబాద్‌లోగల బయోఫార్మాస్యూటికల్ ప్లాంటులో వ్యాక్సిన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్-వి తయారీకి హెటెరోతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా భారత ప్రజలకు సురక్షితమైన, అత్యంత ప్రభావిత వ్యాక్సిన్‌ను అందించే వీలున్నట్లు ఆర్‌డీఐఎఫ్ సీఈవో కైరిల్ డిమిత్రేవ్ పేర్కొన్నారు.
వేగంగా అందించేందుకు
స్పుత్నిక్-విని స్థానికంగా తయారు చేయగలిగితే సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు వీలుంటుందని హెటెరో ల్యాబ్స్ అంతర్జాతీయ మార్కెటింగ్ డైరెక్టర్ బి. మురళీ కృష్ణారెడ్డి ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు దేశీ క్లినికల్ పరీక్షలు దోహదపడనున్నట్లు తెలియజేశారు. కాగా.. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు 2021 మార్చిలోగా పూర్తికావచ్చని ఇటీవల డాక్టర్ రెడ్డీస్ అంచనా వేసింది.
91.4 శాతం
బెలారస్, వెనిజులా తదితర పలుదేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌డీఐఎఫ్ తెలియజేసింది. రష్యాలో 40,000 మందిపై నిర్వహించిన మూడో దశ పరీక్షలలో సానుకూల ఫలితాలు వెలువడినట్లు పేర్కొంది. వీటి రెండో మధ్యంతర డేటా ప్రకారం 91.4 శాతం సత్ఫలితాలు సాధించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో డోసు 10 డాలర్ల(రూ. 740) కంటే తక్కువకు అందించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఎపిడిమియాలజీ, మైక్రోబయాలజీ గమలేయా నేషనల్ సెంటర్ సహకారంతో ఆర్‌డీఐఎఫ్ స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 120 కోట్ల వ్యాక్సిన్లకు దరఖాస్తులు వచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment