సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ.. రూ.117 కోట్లు
3 శాతం తగ్గుదల
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల వేతనం జూన్ 30, 2016తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 3 శాతం తగ్గింది. మూల వేతనం 12 లక్షల డాలర్లు, 44.6 లక్షల డాలర్లు బోనస్, 1.2 కోట్ల డాలర్ల స్టాక్ ఆప్షన్లు, 14,104 డాలర్ల ఇతర భత్యాలు కలసి మొత్తం ఆయన వేతన ప్యాకేజీ 1.77 కోట్ల డాలర్లని(రూ.117 కోట్లు) నియంత్రణ సంస్థలకు మైక్రోసాఫ్ట్ నివేదించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఆయనకు 1.83 కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ లభించింది.
స్టాక్ ఆప్షన్స్ క్షీణించడమే ప్యాకేజీ తగ్గడానికి ప్రధాన కారణం. కాగా ఈ వేతన ప్యాకేజీపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి పీటె వూటెన్ నిరాకరించారు. జూన్ 30, 2016తో ముగిసిన ఏడాది కాలానికి ఎస్ అండ్ృపీ 500 సూచీ 1 శాతం పెరగ్గా, మైక్రోసాఫ్ట్ షేర్ 15 శాతం లాభపడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా నాదెళ్ల నియమితులైనప్పుడు ఆయనకు 5.9 కోట్ల డాలర్ల స్టాక్ ఆప్షన్ష్ ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. 2019 వరకూ ఆయన సీఈఓగా కొనసాగడం, ఇతర షరతులను తృప్తిపరిస్తేనే ఈ దీర్ఘకాలిక పనితీరు ఆధారిత స్టాక్ ఆప్షన్స్‌ను విడతలవారీగా..
2019, 2020, 2021లో అందుకోవడానికి ఆయన అర్హులు. కాగా సత్య పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి(2014,ఫిబ్రవరి) నుంచి చూస్తే మైక్రోసాఫ్ట్ షేర్ 70% పెరిగింది. ఈ ఏడాది జూలైలో చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగిన కెవిన్టర్నర్ 1.3 కోట్ల డాలర్ల వేతనం పొందారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో సత్య నాదెళ్ల తర్వాత అత్యధిక వేతనం పొందిన వ్యక్తి ఈయనే.