పోలీసుల అదుపులో డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులు
రహస్య ప్రాంతాల్లో తమిళనాడు పోలీసుల విచారణ
వేలూరు(తమిళనాడు): ఎర్రచందనం కేసులో ఎక్సైజ్ డీఎస్పీ, నలుగురు కానిస్టేబుళ్లు సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరుకు చెందిన పాట్టాలి మక్కల్ పార్టీ కార్యకర్త చిన్నపయ్యన్ ఈనెల 26న హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి వేలూరు డీఐజీ తమిళ్‌చంద్రన్ విచారణ జరిపారు. విచారణలో శేషాచలం అడవుల నుంచి తీసుకొచ్చే ఎర్రచందనాన్ని చిన్నపయ్యన్ కోళ్లపారంలో ఉంచి వాటిని వేలూరుకు సమీపంలోని అలిమేలు మంగాపురానికి చెందిన నాగేంద్రన్ లారీలో చెన్నై, ఇతర ప్రాంతాలకు తరలించే వారని తెలిసింది. అయితే ముఠా సభ్యులకు తెలియకుండా ఎర్రచందనాన్ని చిన్నపయ్యన్ విక్రయించడంతో అతన్ని హత్య చేసినట్లు తెలిసింది.
దీంతో పోలీసులు తిరుమాల్కుప్పానికి చెందిన వెంకటేషన్, తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా ఇరుముడిచూర్కు చెందిన తంగరాజ్,పెరుమాల్, సత్యమూర్తిలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చిన్నపయ్యన్, నాగేంద్రన్ స్మగ్లింగ్ వ్యవహారం, చిన్నపయ్యన్ హత్య కేసు నుంచి కాపాడేందుకు ఎక్సైజ్ డీఎస్పీ తంగవేలు, హెడ్ కానిస్టేబుళ్లు సామువేల్, సౌందర్‌రాజన్, కానిస్టేబుళ్లు రాజేష్, శ్రీనివాసన్ కలిసి లారీ యజమాని నాగేంద్రన్ వద్ద రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తేలింది.లారీ యజమాని నాగేంద్రన్ భార్య జ్యోతిలక్ష్మి, ఎక్సైజ్ డీఎస్పీ, 4 పోలీసులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.