రెండు రోజుల్లో 46 మంది ‘ఎర్ర’ కూలీల అరెస్టు
* పట్టుబడిన ఓ స్మగర్
* రూ.50 లక్షల ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు (అర్బన్) : జిల్లాలో రెండు రోజుల పాటు జరిపిన దాడుల్లో 46 మంది ‘ఎర్ర’ కూలీలు, ఒక స్మగ్లర్ను చిత్తూరు టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. శనివారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) కలిశల రత్న ఈ మేరకు వివరాలను వెల్లడించారు. నిందితులందరినీ పీలేరు, కేవీ పల్లె, వైవీ పాళెం, భాకరాపేట, రొంపిచెర్ల పరిధిల్లోని అటవీ ప్రాంతంలో పట్టుకున్నట్లు ఓఎస్డీ తెలిపారు. నిందితుల నుంచి టాటా సఫారి, సుమో, పికప్, రెండు మారుతి ఓమ్నీ వాహనాలతో పాటు 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల 28న కే వీ పల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని వడ్డివారిపల్లె బస్టాప్ వద్ద పోలీసులు ఆరుగురు ఎర్రకూలీలను పట్టుకున్నారు. టాటా సఫారి వాహనం, 8 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం అంబువారిపల్లె వద్ద 11 మంది కూలీలను పట్టుకున్నారు. సుమో వాహనాన్ని, 8 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రావారిపాళెం పరిధిలోని రెడ్డిచెరువు వద్ద శుక్రవారం ఏడుగురు కూలీలను పట్టుకున్నారు. ఓ మారుతి వ్యాను, ఆరు ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పీలేరు పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్లమల్లీశ్వర గుడి వద్ద 9 మంది ఎర్ర కూలీలను పట్టుకున్నారు. వారి నుంచి పిక్అప్ వ్యాను, 10 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పీలేరుకు చెందిన స్మగ్లర్ ఎం.భువనేశ్వర్రెడ్డి (20) ఉన్నాడు. ఇతడు గజ్జెల శ్రీనివాసులురెడ్డికి ప్రధాన అనుచరుడు.
రొంపిచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మారుమరెడ్డిగారిపల్లె వద్ద ఉన్న నల్లగుట్ట ప్రాంతంలో శనివారం 11 మంది కూలీలను పట్టుకున్నారు. ఓ మారుతి వ్యాను, పది దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. భాకరాపేట పరిధిలోని వరకొండ అటవీ ప్రాంతంలో శని వారం నలుగురు కూలీలను పట్టుకున్నారు. ఐదు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పీలేరు సీఐ నరసింహులుతో పాటు పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఎర్రావారిపాళెం పరిధిలో జ్ఞానేశ్వర్ అనే మేస్త్రీ, కెవి.పల్లె పోలీసు స్టేషన్ పరిధిలో పెంచలయ్య, నరసయ్య తప్పించుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.