సోషల్ మీడియాతో మోరల్స్ దెబ్బతింటాయి
వాషింగ్టన్: ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాను ఎక్కువ ఉపయోగించే వారిలో జ్ఞానశక్తి తగ్గిపోతుందని, నైతిక శూక్యత కూడా ఏర్పడుతుందని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంకు చెందిన దాదాపు రెండువేల మంది విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది. ‘రిఫ్లెక్టివ్ థాట్’...అంటే స్వీయానుభవాలకు ఆలోచనలు ముడిపెట్టి ఆలోచనా పరిధిని విస్తరించుకోవడం కూడా తగ్గిపోతుందని తేలింది. నైతిక విలువల లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడమే కాకుండా సుఖలాలసత పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది.
సోషల్ మీడియాలో పంచుకునే ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యాఖ్యాన్యాలు, సందేశాలు సంక్షిప్తంగా ఉండడమే కాకుండా వేగంగా స్పందించాల్సిన అవసరం ఉండడం వల్ల రిఫ్లెక్టివ్ థాట్ క్షీణించి పోతోందని ప్రముఖ టెక్ రైటర్ నికోలస్ జీ. కార్ తన ‘ది షాలోస్’ అనే పుస్తకంలో కూడా పేర్కొన్నారు. నైతిక విలువల లక్ష్యాలకు అంతగా ప్రాధాన్యత కూడా ఇవ్వరని ఆయన తెలిపారు. సమాచార మార్పిడి కోసం సోషల్ మీడియాను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తుంటే అంత ఎక్కువగా రిఫ్లెక్టివ్ థాట్ ప్రక్రియ దెబ్బతింటూ వస్తుందని ఆయన చెప్పారు.
విస్కాన్సిన్ యూనివర్శిటీ విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో కూడా ఇవే విషయాలు వెలుగు చూశాయి. ‘జీవితంలో నైతికంగా నేను ఈ విలువలను సాధించాలనుకుంటున్నాను. నైతికతంగా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను’ అనే అంశాలు అస్సలు ఆలోచించడం లేదని అధ్యయనంలో పాల్గొన్న మెజారిటీ విద్యార్థులు తెలిపారు. జీవితంలో సుఖంగా బతకాలని, ప్రతిష్ట కలిగిన పదవులను కోరు కుంటున్నట్లుగా కూడా వారు చెప్పారు.