అబార్షన్‌కు అనుమతించం
అహ్మదాబాద్: అత్యాచారానికి గురైన తన కూతురికి అబార్షన్ చేయించేందుకు అనుమతించాలని ఓ తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. 20 వారాలు దాటిన తర్వాత భారతీయ చట్టం ఇలాంటి పనులకు అంగీకరించదని స్పష్టం చేసింది. టైపాయిడ్ జ్వరంతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలిక వైద్యం నిమిత్తం ఓ వైద్యుడిని సంప్రదించగా అతడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో అబార్షన్‌కు అనుమతించాలంటూ ఆమె తండ్రి గతవారం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. గర్భం దాల్చిన తర్వాత 20 వారాలు దాటితే భారతీయ చట్టం అబార్షన్‌కు అనుమతించదని.. ప్రస్తుతం ఆ అమ్మాయికి 24 వారాలు పూర్తయినందున రేప్ బాధితురాలు అయినా అబార్షన్‌కు చట్టం ఒప్పుకోదని స్పష్టం చేసింది. ప్రసవం పూర్తయ్యేవరకు ఆమె మంచిచెడులు చూసుకోవాలని, పరిహారంగా ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.