భత్కల్కు మళ్లీ బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ-వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్కు జామా మసీదు పేలుళ్ల కేసులో బెయిల్ మంజూరు చేసేందుకు స్థానిక కోర్టు గురువారం తిరస్కరించింది. కేసు దర్యాప్తునకు మే ఎనిమిది వరకు పోలీసులకు సమయం ఇస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ ప్రకటించారు. తన కక్షిదారును అరెస్టు చేసి 90 రోజులు ముగిసినా, చార్జిషీటు సమర్పించలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలన్న భత్కల్ న్యాయవాది ఖాన్ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇటీవలే అరెస్టయిన పాక్ జాతీయుడు జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్ను ప్రశ్నించాల్సి ఉన్నందున, దర్యాప్తునకు మరింత సమయం కావాలని పోలీసులు అభ్యర్థించారు.
కేసు దర్యాప్తు పోలీసులకే
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనాయకుల కేసుల దర్యాప్తుపై ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మధ్య నెలకొన్న వివాదం పరిష్కారమయింది. ఈ కేసుల దర్యాప్తు నుంచి తాము వైదొలగి, ఢిల్లీ పోలీసులకే బాధ్యతలను అప్పగిస్తున్నామని ఎన్ఏఐ ఢిల్లీ హైకోర్టుకు గురువారం తెలిపింది. ఐఎం ఉగ్రవాదులు ఢిల్లీపై దాడులకు కుట్రపన్నినట్టు నగర పోలీసులు 2012ల కేసు నమోదు చేశారు. దీనిపై ఎన్ఐఏ కూడా ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వివాదంపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి వీపీ వైశ్... వివరణ ఇవ్వాల్సిందిగా హోంశాఖను ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసులే నిర్వహిస్తారని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది వరకే చార్జిషీటు కూడా సమర్పించారని తెలిపారు. విచారణకు ఎన్ఐఏ డెరైక్టర్ జనరల్, ఢిల్లీ పోలీసుశాఖ ప్రత్యేక కమిషనర్ హాజరయ్యారు.