దహీ హండీ ఒలింపిక్ గేమా : సుప్రీం కోర్టు
ముంబై: శ్రీకృష్ట జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించే అతిపెద్ద మానవ పిరమిడ్ ఉత్సవం 'దహీ హండీ' పై గతంలో తామిచ్చిన తీర్పుపై పునరాలోచించే ఉద్దేశం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉట్టి ఎత్తు పెంచడమనేది భయంకరమైనదిగా కోర్టు అభివర్ణించింది. ఇందులో ఏమైనా ఒలింపిక్ మెడల్ ఇస్తారా? ఇస్తే మేము చాలా సంతోషిస్తాం అని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ఉట్టి ఎత్తు 20 అడుగులకు మించరాదని సుప్రీం ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాల్సిందిగా ముంబైకి చెందిన కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ పిరమిడ్ గా 'దహీ హండీ' గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించిందని పిటిషనర్ న్యాయస్థానానికి వివరించారు. దాదాపు అన్నిపార్టీలు ఉట్టిఎత్తును పెంచమని కోరుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం పిరమిడ్ ఎత్తును 25 అడుగులకు పెంచాల్సిందిగా గతంలో కోర్టను కోరింది. ఎత్తును తగ్గించలేమని కోర్టు స్పష్టం చేసింది.
దహి హండీ అంటే:
ముంబైలో మట్టి కుండలో పెరుగును నింపి దాన్ని అత్యంత ఎత్తులో వేలాడదీస్తారు. ఈ మట్టి కుండను పగులగొట్టడానికి యువకులు అద్భుతంగా మానవ పిరమిడ్లను ఏర్పాటు చేసి కుండను పగులగొట్టేందుకు పోటీపడతారు. ఈ క్రమంలో కొందరు గాయాలపాలవుతుంటారు.