గుజరాత్లో ఎన్ఎస్జీ ప్రాంతీయ కేంద్రం
గుజరాత్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు మంగళవారం తెలిపారు. ఎన్ఎస్జీ తమకు అనుకూలంగా ఉంటుందని సూచించిన ప్రాంతంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన తెలిపారు.
గుజరాత్ ప్రభుత్వం ఈ కేంద్రం కోసం రెండు ప్రదేశాలను సూచించిందని, ఎన్ఎస్జీ బృందం ఇప్పటికే రెండు ప్రదేశాలూ సందర్శించి నివేదిక సమర్పించిందని ఆయన అన్నారు. అయితే అవి ఎంతవరకు సరిపోతాయనే విషయాన్ని అంచనా వేస్తున్నారని రిజిజు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, భూమిని ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్ర సర్కారు ముందుకొచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికే తమిళనాడులోని చెన్నై, తెలంగాణాలోని హైదరాబాద్, పశ్చిమబెంగాల్లోని కోల్కతా, ముంబైలోని మహారాష్ట్ర నగరాల్లో నాలుగు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.