సర్కారు నిర్ణయంతో పెరగనున్న విమాన చార్జీలు?
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశీయ విమాన చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన నిధి కోసం ప్రత్యేకంగా ఒక లెవీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దూరాన్ని బట్టి వివిధ విమాన ప్రయాణాలపై లెవీ విధించనున్నట్లు ప్రకటించింది. విమానయాన సంస్థలు ఎటూ ఈ మొత్తాన్ని ప్రయాణికుల మీదే మోపుతాయి కాబట్టి టికెట్ల ధరలు పెరగడం ఖాయమని అంటున్నారు.
లెవీ వివరాలు ఇలా ఉన్నాయి... వెయ్యి కిలోమీటర్ల లోపు దూరం వెళ్లే విమానాలకు రూ. 7,500 లెవీ విధిస్తారు. అలాగే 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లే విమానాలకు రూ. 8000, 1500 కిలోమీటర్లకు మించిన దూరం వెళ్లే స్వదేశీ విమానాలకు రూ. 8,500 చొప్పున ఈ రీజనల్ కనెక్టివిటీ లెవీ ఉంటుంది. దాంతో విమాన చార్జీలు కూడా ఆ మేరకు పెరగక తప్పదు. అయితే.. మొత్తం విమాన ప్రయాణానికి కలిపి ఈ లెవీ ఉంటుంది కాబట్టి, అది మొత్తం అన్ని టికెట్లకూ పంపిణీ అవ్వాలి. ఆ లెక్కన చూసుకుంటే తక్కువ మొత్తమే పెరగాలి. కానీ ఎంత మేర పెరుగుదల ఉంటుందనేది నిర్ణయం పూర్తిగా అమలైతే తప్ప తెలియదు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ లెవీ అమలవుతుందని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ తెలిపారు.