జనన, మరణ నమోదులో జిల్లా వెనుకంజ
అద్దంకి: జనన మరణ నమోదు విషయంలో జిల్లా వెనుకబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ గుంటూరు కార్యాలయ డిప్యూటీ డైరక్టరు కే శివశంకర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లాలో జనన మరణనమోదు ప్రక్రియ 90 శాతం పూర్తైదని చెప్పారు. ఇక్కడ మాత్రం రెండేళ్లుగా ఆగిపోయిందని తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏడు మండలాల స్థాయి పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ ఎంలు, మునిసిపల్ సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
2013కు సంతమాగులూరు, అద్దంకి మండలాల లె క్కలు మాత్రమే అందాయని తెలిపారు. జనన, మరణ వివరాలు నమోదు చేసి ఆ రికార్డులను ఉన్నతాధికారులకు పంపకుంటే ఉపయోగం లేదని చెప్పారు. దీనివల్ల భారీ తేడాలు వస్తాయన్నారు. భారత ప్రభుత్వ జనన, మరణ చట్టం- 1970 ప్రకారం నెలలోగా ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలన్నారు. కుదరకుంటే శాశ్వత చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలని చెప్పారు. ఇవి విదేశాల్లోనూ చెల్లుబాటవుతాయని చెప్పారు. ఎలాంటి సెక్షన్ ప్రకారం మంజూరు చేశారో ఆ సెక్షన్‌ను ఉదహరిస్తూ నోటీసు ఇవ్వాలని చెప్పారు. కొన్ని సార్లు ధ్రువీకరణ పత్రంపై ఆధారపడి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి, ఉన్నత ఉద్యోగాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. జనన , మరణ నమోదు ఫైలును ప్రతి నెలా ఐదో తేదీ లోగా సంబంధిత అధికారులకు పంపాలని సూచించారు.
జీఓ నంబరు 161 ఉంది..
2000 జనవరి ఒకటో తేదీకి ముందు జరిగిన జనన, మరణ నమోదు రిజిస్టరు కార్యాలయంలో నమోదై.. బిడ్డ పేరును 15 సంవత్సరాల వయసు వచ్చే లోపుగా నమోదు చేయించుకోని వారు.. తిరిగి నమోదు చేసుకొనేలా జీఓ నంబరు 161 ద్వారా అవకాశం కల్పించామని డీడీ శివశంకరు బాబు తెలిపారు. జిల్లా స్టాటిటికల్ అధికారి శ్రీధర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో టీ వెంకటేశ్వర్లు, ఎంపీహెచ్‌ఈవో ఏ నాగేశ్వరరావు, అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు, మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ, కొరిశపాడు, జే పంగులూరు మండలాల సిబ్బంది పాల్గొన్నారు.