ఈసీ వద్దన్నా.. వీసీ కానిచ్చేశారు!
సాక్షి, సిటీబ్యూరో : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పాలకమండలి, ఉపకులపతిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. పలు ప్రైవేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంలో యాజమాన్యం అనుసరిస్తోన్న తీరును పాలకమండలి సభ్యులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలకమండలి అభ్యంతరాలను పక్కనపెట్టిన ఉపకులపతి, ఇతర అధికారులు ఎంచక్కా ఎంవోయూలను కానిచ్చేశారు. ఈ నేపథ్యంలో.. పాలకమండలి సమావేశం జరిగితే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, గత రెండు నెలలుగా సమావేశాలను ఏర్పాటు చేయడం లేదని సమాచారం. గతంలో నెలకు రెండు మార్లు సమావేశాలు నిర్వహించిన అధికారులు.. రెండు నెలలువుతున్నా పాలకమండలి సమావే శం ఏర్పాటుపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహేంద్ర‘టెక్’పై ఎంత ప్రేమో!
పలు సాంకేతిక కోర్సుల నిర్వహణ కోసం జేఎన్టీయూహెచ్తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు నగరంలోని మహేంద్ర టెక్ సంస్థ గతేడాది నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. మహేంద్ర టెక్ సంస్థతో అవగాహనకు జేఎన్టీయూహెచ్ పాలకమండలి తొలిదశలోనే తిరస్కరించింది. అయినప్పటికీ యూని వర్సిటీ యాజమాన్యం పదేపదే ఈ ప్రతిపాదనలను ఈసీ సమావేశంలో పెడుతుండటంపై సభ్యుల నుం చి సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేటు సంస్థ నిర్వహించే టెక్నికల్ కోర్సులకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి అనుమతి లేకపోవడం, కోర్సులకు వసూలు చేసే ఫీజులు భారీగా ఉండడం, సంస్థ ప్రతిపాదనల్లో సామాజిక బాధ్యతను విస్మరించడం.. తదితర ప్రతికూల అంశాలను పాలకమండలి ఎత్తి చూపింది.
గుట్టుగా కానిచ్చేశారు
ఏఐసీటీఈ అనుమతి లేనిదే మహేంద్ర టెక్‌తో ఎంవోయూ తగదని గత ఐదు సమావేశాల్లోనూ పాలకమండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ గతనెల 29న సదరు సంస్థతో జేఎన్టీయూహెచ్ యాజమాన్యం ఎంవోయూ కుదుర్చుకుంది. పాలకమండలి వద్దన్నా.. ఉపకులపతి మాత్రం కానిచ్చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో పెద్దెత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ రమణరావును వివరణ కోరగా.. ‘ఏఐసీటీఈ అనుమతి ఉంటేనే ఏం వోయూ కుదుర్చుకోవాలని ఈసీ సూచిం చింది. అయితే.. టెక్ మహేంద్ర సంస్థ తాము నిర్వహించబోయే కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ప్రస్తుతానికి ఆ సంస్థతో కేవలం ‘కండిషనల్ ఎంవో యూ’ మాత్రమే కుదుర్చుకున్నాం. ఏఐసీటీఈ అనుమతి లేకుండా సదరు సంస్థ ఎటువంటి కోర్సు లు నిర్వహించేందుకు వీలు కాదు’ అన్నారు.