Registrars office
-
వీఆర్వో, తహశీల్దార్ సంతకాలు ఫోర్జరీ.. పక్కా ప్లాన్‌తో భూమి దొంగ రిజిస్ట్రేషన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీఆర్వో, తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి విలువైన స్థలాన్ని కాజేసేందుకు విఫలయత్నం చేశారు. తీరా స్థల యజమానికి విషయం తెలిసి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన తమ్మా వినోద్‌రెడ్డికి ఆర్ఎస్ నంబర్ 64–3లో 25 సెంట్ల విలువైన స్థలం ఉంది. ఆ స్థలం తన తల్లికి వీలునామా ద్వారా సక్రమించింది. మచిలీపట్నానికి చెందిన స్థలాల బ్రోకర్ అలీ.. తమ్మా వినోద్‌రెడ్డికి చెందిన స్థలాన్ని అమ్మి పెడతానని చెప్పాడు. అయితే రేటు వద్ద తేడా రావడంతో స్థలానికి సంబంధించిన డీల్ ఆగిపోయింది. అయితే ఆ స్థలంపై కన్నేసిన అలీ.. దాన్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. పామర్రు, గుడివాడలోని ఇద్దరు విలేకరుల సాయంతో దొంగ పత్రాలు సృష్టించాడు. వారికి అలీ భారీగా ముడుపులు చెల్లించినట్లు సమాచారం. దీంతో వారు వీఆర్వో, తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి స్థలం అలీదేనని, సర్టిఫికెట్లు తయారు చేశారు. పిత్రార్జితం, ఇంటి స్థలం కింద డాక్యుమెంట్ తయారు చేయించుకున్న అలీ.. తన భార్య పేరుతో తొలుత గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సైతం చేతులు తడిపాడు. పామర్రుకు చెందిన స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించకుండా గుడివాడలో చేయించారు. పామర్రు రిజిస్ట్రార్ సైతం ఓకే చెప్పడంతో గుడివాడ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తంతు ముగిసింది. తర్వాత ఆ స్థలాన్ని అలీ మళ్లీ పామర్రుకు చెందిన ఇద్దరికి కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాడు. స్థలం కొనుగోలు చేసిన వారు సంబంధిత స్థలంలో పూజలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న స్థల యజమాని.. ఆరా తీయగా, రెండు నెలల కిందటే తమ పేర్న రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ డాక్యుమెంట్లు చూపారు. దీంతో ఉలిక్కిపడ్డ వినోద్‌రెడ్డి పామర్రు ఎస్ఐ అవినాష్‌కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడివాడ డీఎస్పీ సత్యానందం బుధవారం ‘సాక్షి’తో చెప్పారు. స్థలం యజమాని తనకు ఫిర్యాదు చేయగానే సంతకాన్ని పరిశీలించి.. ఫోర్జరీ చేశారని నిర్థారించుకుని వెంటనే పామర్రు, గుడివాడ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పామర్రు తహశీల్దార్ భరత్‌రెడ్డి చెప్పారు. -
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పబ్లిక్ డేటా ఎంట్రీ ..
సాక్షి, విజయవాడ: ప్రజల్లో రిజిస్ట్రేషన్‌పై ఉన్న అపోహలను నివృత్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ జయలక్ష్మి సూచించారు. ఆమె సోమవారం గాంధీనగర్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం నుంచి పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం అమల్లోకి వస్తోందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునేవారు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకొని సేవలు పొందవచ్చన్నారు. ఆన్లైన్ విధానం ద్వారా సమయం ఆదాతో పాటు, పారదర్శక సేవలు అందుతాయని జయలక్ష్మి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌కు ఏ సమయంలో ఎవరు రావాలో స్లాట్ బుకింగ్ ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. -
అంతా మామూళ్లే!
► రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ పంజా ► ఇద్దరు సబ్రిజిస్ట్రార్లతో కలిపి తొమ్మిదిమందిపై చర్యలకు సిఫార్సు ► తనిఖీలలో దొరికిన అదనపు నగదు రూ.77,333 ► అవినీతిని అంతమొందించడమే లక్ష్యం ► ఏసీబీ డీఎస్పీ నాగరాజు కడప అర్బన్ : రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయి. మామూళ్లు ముట్టజెప్పందే అక్కడ అడుగు ముందుకుపడటం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైంది. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పాత రిమ్స్‌లో ఉన్న కడప అర్బన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని, లంచం ఇవ్వనిదే పనులు జరగడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధకశాఖ అధికారులు బు«ధవారం మెరుపుదాడి చేశారు. కార్యాలయం ఆవరణ చుట్టుపక్కల ఉన్న స్టాంప్ వెండర్స్‌ను, దుకాణాల నిర్వాహకులను, జిరాక్స్ సెంటర్ల యజమానులను, సిబ్బందిని అదుపులోకి తీసుకుని కార్యాలయంలోకి తమ వెంట తీసుకెళ్లారు. కార్యాలయంలో అధికారులు,సిబ్బందిని తమ వెంట తీసుకెళ్లిన వారిని అందరినీ సోదా చేశారు. ఈ సోదాల్లో కార్యాలయంలో నిబంధనల మేరకు ఈసీలకు, స్టాంప్ వెండింగ్‌కు సంబం«ధించి నిర్వహిస్తున్న రికార్డుల ప్రకారం రూ.8 వేలు ఉండాల్సి ఉంది. కానీ, రూ.77,333 నగదు అదనంగా ఉంది. ఈ డబ్బును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. అవినీతికి పాల్పడితే మా దృష్టికి తీసుకురండి ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ఈ దాడుల్లో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న బి.నాగరాజారావు, వి.జయకుమార్‌లతోపాటు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక షరాబు, ఒక అటెండర్ మొత్తం కలిపి తొమ్మిది మంది కూడా అవినీతికి పాల్పడినట్లుగా తమ దర్యాప్తులో తేలిందన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. తాము నిర్వహించిన దాడుల్లో వీరికి సహాయంగా బయటి వ్యక్తులు విశ్వనాథ్, సుధీర్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని తేలిందన్నారు. ఏ విభాగానికి సంబంధించిన వారైనా అవినీతికి పాల్పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవినీతిని అంతమొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్నిసార్లు ఏసీబీ దాడులు చేసినా అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని కార్యాలయానికి వచ్చిన వారు చర్చించుకోవడం కనిపించింది.