![Registration with forged signatures - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/9/Forgery.jpg.webp?itok=DniaoDHX)
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీఆర్వో, తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి విలువైన స్థలాన్ని కాజేసేందుకు విఫలయత్నం చేశారు. తీరా స్థల యజమానికి విషయం తెలిసి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన తమ్మా వినోద్‌రెడ్డికి ఆర్‌ఎస్ నంబర్ 64–3లో 25 సెంట్ల విలువైన స్థలం ఉంది. ఆ స్థలం తన తల్లికి వీలునామా ద్వారా సక్రమించింది. మచిలీపట్నానికి చెందిన స్థలాల బ్రోకర్ అలీ.. తమ్మా వినోద్‌రెడ్డికి చెందిన స్థలాన్ని అమ్మి పెడతానని చెప్పాడు.
అయితే రేటు వద్ద తేడా రావడంతో స్థలానికి సంబంధించిన డీల్ ఆగిపోయింది. అయితే ఆ స్థలంపై కన్నేసిన అలీ.. దాన్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. పామర్రు, గుడివాడలోని ఇద్దరు విలేకరుల సాయంతో దొంగ పత్రాలు సృష్టించాడు.
వారికి అలీ భారీగా ముడుపులు చెల్లించినట్లు సమాచారం. దీంతో వారు వీఆర్‌వో, తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి స్థలం అలీదేనని, సర్టిఫికెట్లు తయారు చేశారు. పిత్రార్జితం, ఇంటి స్థలం కింద డాక్యుమెంట్ తయారు చేయించుకున్న అలీ.. తన భార్య పేరుతో తొలుత గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు.
రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సైతం చేతులు తడిపాడు. పామర్రుకు చెందిన స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించకుండా గుడివాడలో చేయించారు. పామర్రు రిజిస్ట్రార్ సైతం ఓకే చెప్పడంతో గుడివాడ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తంతు ముగిసింది. తర్వాత ఆ స్థలాన్ని అలీ మళ్లీ పామర్రుకు చెందిన ఇద్దరికి కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాడు.
స్థలం కొనుగోలు చేసిన వారు సంబంధిత స్థలంలో పూజలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న స్థల యజమాని.. ఆరా తీయగా, రెండు నెలల కిందటే తమ పేర్న రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ డాక్యుమెంట్లు చూపారు. దీంతో ఉలిక్కిపడ్డ వినోద్‌రెడ్డి పామర్రు ఎస్‌ఐ అవినాష్‌కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడివాడ డీఎస్పీ సత్యానందం బుధవారం ‘సాక్షి’తో చెప్పారు. స్థలం యజమాని తనకు ఫిర్యాదు చేయగానే సంతకాన్ని పరిశీలించి.. ఫోర్జరీ చేశారని నిర్థారించుకుని వెంటనే పామర్రు, గుడివాడ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పామర్రు తహశీల్దార్ భరత్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment