అంతా మామూళ్లే!
కడప అర్బన్ : రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయి. మామూళ్లు ముట్టజెప్పందే అక్కడ అడుగు ముందుకుపడటం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైంది. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పాత రిమ్స్‌లో ఉన్న కడప అర్బన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని, లంచం ఇవ్వనిదే పనులు జరగడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధకశాఖ అధికారులు బు«ధవారం మెరుపుదాడి చేశారు.
కార్యాలయం ఆవరణ చుట్టుపక్కల ఉన్న స్టాంప్ వెండర్స్‌ను, దుకాణాల నిర్వాహకులను, జిరాక్స్ సెంటర్ల యజమానులను, సిబ్బందిని అదుపులోకి తీసుకుని కార్యాలయంలోకి తమ వెంట తీసుకెళ్లారు. కార్యాలయంలో అధికారులు,సిబ్బందిని తమ వెంట తీసుకెళ్లిన వారిని అందరినీ సోదా చేశారు. ఈ సోదాల్లో కార్యాలయంలో నిబంధనల మేరకు ఈసీలకు, స్టాంప్ వెండింగ్‌కు సంబం«ధించి నిర్వహిస్తున్న రికార్డుల ప్రకారం రూ.8 వేలు ఉండాల్సి ఉంది. కానీ, రూ.77,333 నగదు అదనంగా ఉంది. ఈ డబ్బును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
తాము నిర్వహించిన దాడుల్లో వీరికి సహాయంగా బయటి వ్యక్తులు విశ్వనాథ్, సుధీర్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని తేలిందన్నారు. ఏ విభాగానికి సంబంధించిన వారైనా అవినీతికి పాల్పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవినీతిని అంతమొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్నిసార్లు ఏసీబీ దాడులు చేసినా అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని కార్యాలయానికి వచ్చిన వారు చర్చించుకోవడం కనిపించింది.