డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు చిత్రంలో లూర్దయ్యనాయుడు
కడప అర్బన్: మూడేళ్లలోనే సుమారు అయిదారు కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను కూడగట్టాడాయన. ముప్పై ఏళ్ల సర్వీసున్నా గడచిన మూడేళ్లలోనే వడివడిగా అవినీతికి పాల్పడ్డాడు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులకు అండగా నిలిచాడు. తక్కువ పన్ను చెల్లించేలా మార్గం చూపి తాను అవినీతికి దారి ఏర్పరుచుకున్నాడు. ఆయనే కడప కమర్షియల్ ట్యాక్స్ డెప్యుటీ కమిషనర్ జాగంటి లూర్దయ్యనాయుడు. ఈయన అవినీతి బాగోతం గుట్టు రట్టయింది. అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు బహిర్గతపరిచారు.కర్నూలు జిల్లాకు చెందిన లూర్దయ్యనాయుడు 1989 మార్చి 10న వాణిజ్య పన్నులశాఖలో ఏసీటీఓగా చేరారు. ఏసీటీఓగా, డీసీటీఓగా హైదరాబాదు, కడప జిల్లాలలో పనిచేశారు. 2017 నుంచి కడపలో డీసీగా పనిచేస్తున్నారు. ఈ కాలవ్యవధిలోనే అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులున్నాయి. ఏసీబీ అధికారుల లెక్కల ప్రకారమే ఆయన అక్రమాస్తులు విలువ రూ.2 కోట్లు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు మార్కెట్ విలువమేరకు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఉండవచ్చని అంచనా.
అవినీతి అధికారి ఆస్తుల చిట్టా
కడప, విజయవాడ, హైదరాబాదు, బెంగుళూరులలో లూర్దయ్యనాయుడుకు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నాయుడు పేరు మీద కర్నూలులోని సరస్వతి నగర్‌లో రెండంతస్తుల నివాస గృహముంది. టీవీఎస్ స్టార్ సిటీ మోటారు సైకిల్, సుజుకి మ్యాక్స్ మోటారు సైకిల్ ఉన్నాయి. భార్య నిర్మలాదేవి పేరుమీద కర్నూలుజిల్లా చాగలమర్రిలో రెండతస్తుల గృహం నిర్మిస్తున్నట్లు గుర్తించారు. అదే గ్రామంలో రెండు వ్యవసాయ భూములు, ట్రాక్టర్ ఉన్నాయి. మూడు..నాలుగో కుమార్తెల పేరు మీద కూడా చాగలమర్రిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. లూర్దయ్యనాయుడి భార్య పేరున బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలున్నాయి. ఇంటిలో రూ.4.20 లక్షల నగదు లభ్యమైంది. రూ. 23 లక్షల విలువైన 768 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిలో రెండు డైమండ్ నెక్లెస్‌లు ఉన్నాయి. రూ.50 వేల విలువైన వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
తప్పుడు లెక్కలతో..
లూర్దయ్యనాయుడు తన సర్వీసులో డీసీ హోదాలో అక్రమాస్తులను సంపాదించగలిగారని గుర్తించినట్లు భోగట్టా. వ్యాపార లావాదేవీలు తక్కువ చూపుతూ పన్ను ఎగ్గొట్టే వారికి సహకరిస్తూ అక్రమాస్తులను కూడగట్టారని అధికారుల విచారణలో గుర్తించారు. ఈ దాడులతో ఒక్కసారిగా కమర్షియల్ ట్యాక్స్‌లో అలజడి రేగింది. కొంతమంది అవినీతి అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నాగభూషణం మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు సెర్చ్ వారెంట్ ద్వారా ఏకకాలంలో కడప, బెంగుళూరు, హైదరాబాదు, విజయవాడల్లో లూర్దయ్యనాయుడు, బంధువుల ఇళ్లపై నాలుగు బృందాలుగా దాడులు నిర్వహించామన్నారు. కడపలో కీర్తి ఎన్‌క్లేవ్‌లో 104 ప్లాట్‌లో నివసిస్తున్న లూర్దయ్యనాయుడు ఇంటిపై నిర్వహించిన దాడిలో తనతోపాటు ఏసీబీ సీఐలు శ్రీనివాసులురెడ్డి, సూర్యనారాయణ, కర్నూలు నుంచి ఖాదర్‌బాష, సిబ్బందితో కలిసి పాల్గొన్నామన్నారు. అతన్ని అరెస్టు చేసి బుధవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు.
ఫిర్యాదు చేయండి
ఎవరైనా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే మా దృష్టికి తీసుకురండి.ఉపేక్షించవద్దు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. సమాచారం అందించేవారు ఆందోళన చెందనక్కరలేదు. పాత రిమ్స్‌లోని కార్యాలయంలో నేరుగాగానీ, సెల్ నెం. 94404 46191 నెంబరులోగానీ సంప్రదించవచ్చు.ఎం.నాగభూషణం..ఏసీబీ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment