Registration system
-
రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆన్లైన్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలను విస్తృతంగా అందించనున్నారు. అత్యాధునిక కార్డ్ ప్రైం సాఫ్ట్వేర్, ఈ–స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సేవలు అందుబాటులోకి తేనున్నారు. కార్డ్ ప్రైం ద్వారా సులభతరమైన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్లైన్లో సమర్పించే వెసులుబాటు కల్పించారు. కార్డ్ ప్రైం అప్లికేషన్ ద్వారా వినియోగదారులు దస్తావేజులను వారే స్వయంగా రూపొందించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్లైన్లోనే చెల్లించే సదుపాయం కల్పించారు. అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ–సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్‌కు మరింత భద్రత ఉంటుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లోనూ పేరు మార్పు జరుగుతుంది. ఆధునిక సాంకేతికత ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లను నిర్మూలించవచ్చు. ఈ–స్టాంపింగ్‌తో వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ–స్టాంపింగ్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఈ స్టాంపింగ్‌తో స్టాంపుల కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడినట్లు అవుతుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌సీఎల్) బ్రాంచ్‌లు, స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ)లో ఈ స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల ద్వారా ఈ– స్టాంపులను విక్రయిస్తారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సైతం పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతగా 1,680 సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. అనంతరం మిగిలిన సచివాలయాల్లో కూడా సేవలను విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వస్తాయి. స్టాంప్ విక్రయ సేవలు, ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్), సీసీ, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లూ మొదలవుతున్నాయి. ఐరిస్‌తో వేలిముద్రల సమస్యకు పరిష్కారం ఈ సిగ్నేచర్ కోసం వేలిముద్రలు పడటంలేదనే ఫిర్యాదులు రావడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. ఈ సమస్య పరిష్కారానికి ఐరిస్ యంత్రాలు కొనుగోలు చేసింది. అవసరమైతే మరికొన్ని కొనేలా ఆదేశాలు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో వేలిముద్రలు పడకపోయినా ఐరిస్ (కళ్లు) ద్వారా ఆ పక్రియను పూర్తి చేయవచ్చు. అపోహలు వద్దు – దుష్ప్రచారాలను నమ్మొద్దు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా జనరేటయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాల జీ యాక్ట్ – 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భ ద్రత ఉంటుంది. డిజిటల్ రిజిస్టర్డ్ డా క్యుమెంట్ అందుబాటులోకి వస్తుంది. ఫిజి కల్ డాక్యు మెంట్‌తో సమానంగా డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్‌కు గుర్తింపు ఉంటుంది. ఈ– సైన్ ద్వారా మరింత భద్రత ఉంటుంది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ వెరిఫికేషన్‌తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే వెరిఫై చేసుకునే సదుపాయం ఉంది. నూతన విధానంలో∙భద్రతా ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందుతుంది. ఈ విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్లు అనేది పూర్తి ‘అవాస్తవం’. ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ అనేది ‘వాస్తవం’. నూతన విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది అవాస్తవం. ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్నవారికి ఈ స్టాంప్‌పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ చేసి ఇస్తారు. సూచనలు, ఫిర్యాదులకు ‘జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్’ను వినియోగించుకోవచ్చు. -
దరఖాస్తు చేసిన వారానికే ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని, దరఖాస్తు చేసిన వారం రోజులకే ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భార్యభర్తలిద్దరు ఒకేచోట పని చేసేందుకుగాను స్పౌస్ కేసుల్లో బదిలీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ విషయాల్లో అనేక సార్లు స్పష్టతనిచ్చినా సరిగా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు సాటి ఉద్యోగుల కుటుంబాలపై సానుభూతి లేదా’అని ప్రశ్నించారు. ఖాళీలు లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించయినా ఉద్యోగాలివ్వాలన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జోషిని ఆదేశించారు. ఇది మానవత్వానికి సంబంధించిన అంశమని, చనిపోయిన ఉద్యోగి కుటుంబం వీధిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హరితహారం, తెలంగాణ కంటి వెలుగు, ధరణి వెబ్సైట్ తదితర కార్యక్రమాలపై శనివారం ప్రగతి భవన్లో కలెక్టర్లు, జేసీలతో సమావేశం నిర్వహించిన సీఎం పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో.. మిషన్ భగీరథ పనులు రెండు నెలల్లో నూటికి నూరు శాతం పూర్తవ్వాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ రూరల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పనుల వేగం పెంచాలన్నారు. భగీరథ చివరి దశకు చేరుకుందని, గ్రామాల్లో అంతర్గత పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కొన్ని చోట్ల భగీరథ పైపు లైన్లు పగులగొట్టి పొలాలకు నీళ్లు పెడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమంపై మాట్లాడుతూ.. ‘ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసవరమైన వారికి చికిత్స అందించేందుకు వచ్చే నెల చివరి వారం నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో కంటి వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. ప్రతి మండలానికి ఓ కంటి పరీక్ష బృందం నియమించాలి. గ్రామంలో ఎన్ని రోజులు క్యాంపు నిర్వహించాలో ముందే నిర్ణయించి, ప్రజలకు సమాచారమివ్వాలి. అందరూ పరీక్షలు చేయించుకునేలా చైతన్యం కలిగించాలి. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రైవేటు, ప్రభుత్వ కంటి వైద్యశాలలకు తరలించి, ఆపరేషన్లు చేయించాలి. రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని ప్రాథమిక అంచనా. వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎన్జీవోలు, విద్యార్థులు, దాతలు, టీచర్లు, మహిళా సంఘాలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి’ అన్నారు. ‘మహిళా సంక్షేమం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతర ప్రయత్నాలు జరగాలి. మహిళా అధికారులు కనీసం నెలకోసారి సమావేశమై కార్యక్రమాలు రూపొందించాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి’’అని సూచించారు. జిల్లాల్లో అవసరాలు తీర్చడం కోసం ప్రతి కలెక్టర్‌కు రూ.2 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రతులను కలెక్టర్లకు సీఎం అందించారు. జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం, ధరణి వెబ్ సైట్ ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాల వివరాలు పంపితే వెంటనే నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. స్టీల్, సిమెంట్‌తో పాటు ఇతర మెటీరియల్ ధరలు పెరిగినందున నిర్మాణ వ్యయం పెరుగుతోందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇతర నిర్మాణాల వ్యయం కూడా పెరిగినందున ధరల సవరణపై బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ సమావేశమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రగతి లేదు ‘తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా నిలిచింది. 2017–18లో 19.84 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించింది. 2018–19లో 21 శాతం వచ్చే అవకాశం ఉంది. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత ప్రగతి లేదు. పెరిగిన సంపద ప్రజల బాగోగులకు వినియోగించాలి. భవిష్యత్ తరాలకు ఎంత సంపద ఇచ్చినా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుంటే అది వృథా. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంచడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్లు బాధ్యతతో నిర్వర్తించాలి. గ్రామాల్లోని నర్సరీలను సందర్శించాలి. గ్రామాల్లో మొక్కలు పెంచే బాధ్యతలను సర్పంచులకు ఇస్తూ ఇటీవలే చట్టం కూడా తెచ్చాం. కొత్త చట్టం ప్రకారం ప్రతి పంచాయతీ, మునిసిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఇది గ్రామ కార్యదర్శి బాధ్యత. ఫారెస్ట్ రేంజ్ అధికారుల సహకారంతో నర్సరీలు నిర్వహించాలి. స్థానిక సంస్థలకు రూ. 2,500 కోట్లను బడ్జెట్లో కేటాయించాం. ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి కూడా రూ.3 లక్షల నిధులొస్తాయి. పెద్ద గ్రామాలకు రూ.25 లక్షలు వస్తాయి. ఇవి కాకుండా పన్నుల ద్వారా ఆదాయం, ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులొస్తాయి. వాటితో స్థానికంగా పనులు చేసుకోవాలి’అని చెప్పారు. -
రిజిస్ట్రేషన్ వ్యవస్థకు రూ.100 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను ప్రారంభించాలంటే ఖర్చు భారీగానే ఉండబోతోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లేని 473 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన పరికరాలు, సర్వర్లు, నెట్వర్క్ ఏర్పాటు, సిబ్బంది వేతనాలు, రోజువారీ వ్యవహారాల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యవస్థ ఏర్పాటుకే రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఇవన్నీ అవసరం..! రిజిస్ట్రేషన్ కార్యకలపాలకు అవసరమయ్యే సరంజామాతో పాటు మానవ వనరులను సమకూర్చే బాధ్యతను రాష్ట్ర టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్)కు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగాలంటే అవసరమైన పరికరాల జాబితాను ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి పంపింది. ప్రతి తహసీల్‌కు 4 కంప్యూటర్లు, స్కానర్, రెండు ప్రింటర్లు, 2 వేలిముద్రల నమోదు యంత్రాలు, 2 వెబ్‌క్యామ్‌లు, 1 వ్యాన్ ఆప్టిమైజర్, నెట్వర్క్ ర్యాక్, మోడెమ్, స్విచ్, 2 సీసీ కెమెరాలు, ఒక డిజిటల్ కెమెరా, డిస్ప్లే యూనిట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. ప్రతి తహసీల్ కార్యాలయంలో ఒక డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ (డీపీఓ), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)లు అవసరమవుతారని, దాదాపు వెయ్యి మంది సిబ్బంది కావాలని పేర్కొన్నారు. ముందడుగు పడేనా..? రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి సర్వర్లు, నెట్వర్క్ అనే రెండు సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే గచ్చిబౌలిలోని సర్వర్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. దీంతో పాటు రెయిల్‌టెల్ నెట్‌వర్క్‌ను ప్రతి రెవెన్యూ కార్యాలయానికి అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రతిపాదనలేవీ ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలోనే ఉన్న ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం మార్చి 12 నాటికి సాధ్యపడే అవకాశాలు కనిపించట్లేదు. -
కుప్పకూలనున్న రిజిస్ట్రేషన్ల వ్యవస్థ
ప్రజల ఆస్తులకు రక్షణ కరువు ముందుగా స్లాట్ బుకింగ్ నగరంలో దరఖాస్తు నమూనా ఆందోళనలో రిజిస్ట్రేషన్స్ సిబ్బంది విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ఆన్లైన్ విధానం పేరుతో రిజిస్ట్రేషన్స్ శాఖను ప్రైవేటు వక్తులకు సర్కారు ధారాదత్తం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. త్వరలో రిజిస్ట్రేషన్స్ కార్యకలాపాలన్నింటినీ మీ-సేవకు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్లైన్ విధానాన్ని హడావుడిగా చేపట్టిన ప్రభుత్వం.. ప్రజల ఆస్తుల క్రయవిక్రయాలను మీ-సేవ కేంద్రాలకు అప్పగించడానికి తుది చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం అమల్లోకి వస్తే మరికొన్ని నెలల్లో రిజిస్ట్రేషన్స్ శాఖ కనుమరుగవుతుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు ఆధీనంలో నడుస్తున్న మీ-సేవకు రిజిస్ట్రేషన్స్ శాఖ కార్యకలాపాలన్నింటినీ దొడ్డిదారిలో అప్పగించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు, సిబ్బంది, వారికి అనుబంధంగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ-సేవలను టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) ద్వారా అందించేవారు. అప్పట్లో కొన్ని రకాల సేవలను మాత్రమే సర్వర్ ద్వారా ఈ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి కిరణ్ ఈ-సేవలను, మీ-సేవలుగా మార్చి.. దాదాపు 200 రకాల సేవలను ఈ కేంద్రాలకు అప్పగించారు. సీఎం సోదరుడు నిర్వహిస్తున్న డేటామాట్రిక్ కార్పొరేషన్‌కు మీ-సేవ కాంట్రాక్టు అప్పగించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ శాఖ దశలవారీగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయి ప్రజల ఆస్తులకు భద్రత కరవవుతుందని ఆరోపిస్తున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని చేసే వేలాది మంది సిబ్బందిని వివిధ డిపార్టుమెంట్లకు సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒక సబ్ రిజిస్ట్రార్, అటెండర్ మాత్రమే ఉంటారు. ఆస్తుల లావాదేవీల్లో ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది చేసే పనంతా మీ-సేవల్లోనే చేసేస్తారు. దాంతో కార్యాలయాల్లో సిబ్బంది, వేతనాలు, అలవెన్స్‌లు, ఇతర ఖర్చులు కలిసి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ ఇలా.. రిజిస్ట్రేషన్ చేసే వారు ముందుగా మీ-సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్‌లో దరఖాస్తుదారుడికి సీరియల్ నంబర్, రిజిస్ట్రేషన్ డేట్ ఇస్తారు. నిర్ణీత తేదీలో మీ-సేవ కేంద్రానికి వెళ్లి కక్షిదారులు తమ ఆస్తులపై వివిధ రకాల లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మీ-సేవా కేంద్రంలో పొందుపొరిచిన నమూనా దరఖాస్తు కూడా ఇప్పటికే తయారైంది. అర్జీదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆ దరఖాస్తును పూర్తి చేస్తే ఆన్లైన్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళుతుంది. సబ్ రిజిస్రార్ వెరిఫికేషన్ చేసి క్లిక్ చేస్తే మీ-సేవ కేంద్రంలోనే డాక్యమెంటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. కక్షిదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముఖం చూడకుండానే మీ-సేవ కేంద్రంలోనే తమ ఆస్తుల లావాదేవీలు జరుపుకోవచ్చు. స్తంభించిన వందల కోట్ల లావాదేవీలు.. ఈ విషయమై గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఆస్తుల లావాదేవీలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు జరగక, ఈసీలు, దస్తావేజు నకళ్లు తదితర సేవలు నిలిచిపోయి ప్రజలు ఆగచాట్లు పడుతున్నారు.