కలెక్టర్లు, జేసీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని, దరఖాస్తు చేసిన వారం రోజులకే ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భార్యభర్తలిద్దరు ఒకేచోట పని చేసేందుకుగాను స్పౌస్ కేసుల్లో బదిలీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ విషయాల్లో అనేక సార్లు స్పష్టతనిచ్చినా సరిగా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు సాటి ఉద్యోగుల కుటుంబాలపై సానుభూతి లేదా’అని ప్రశ్నించారు. ఖాళీలు లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించయినా ఉద్యోగాలివ్వాలన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జోషిని ఆదేశించారు. ఇది మానవత్వానికి సంబంధించిన అంశమని, చనిపోయిన ఉద్యోగి కుటుంబం వీధిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హరితహారం, తెలంగాణ కంటి వెలుగు, ధరణి వెబ్‌సైట్ తదితర కార్యక్రమాలపై శనివారం ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, జేసీలతో సమావేశం నిర్వహించిన సీఎం పలు సూచనలు చేశారు.
ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో..
మిషన్ భగీరథ పనులు రెండు నెలల్లో నూటికి నూరు శాతం పూర్తవ్వాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ రూరల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పనుల వేగం పెంచాలన్నారు. భగీరథ చివరి దశకు చేరుకుందని, గ్రామాల్లో అంతర్గత పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కొన్ని చోట్ల భగీరథ పైపు లైన్లు పగులగొట్టి పొలాలకు నీళ్లు పెడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమంపై మాట్లాడుతూ.. ‘ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసవరమైన వారికి చికిత్స అందించేందుకు వచ్చే నెల చివరి వారం నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో కంటి వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. ప్రతి మండలానికి ఓ కంటి పరీక్ష బృందం నియమించాలి.
గ్రామంలో ఎన్ని రోజులు క్యాంపు నిర్వహించాలో ముందే నిర్ణయించి, ప్రజలకు సమాచారమివ్వాలి. అందరూ పరీక్షలు చేయించుకునేలా చైతన్యం కలిగించాలి. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రైవేటు, ప్రభుత్వ కంటి వైద్యశాలలకు తరలించి, ఆపరేషన్లు చేయించాలి. రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని ప్రాథమిక అంచనా. వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎన్జీవోలు, విద్యార్థులు, దాతలు, టీచర్లు, మహిళా సంఘాలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి’ అన్నారు. ‘మహిళా సంక్షేమం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతర ప్రయత్నాలు జరగాలి. మహిళా అధికారులు కనీసం నెలకోసారి సమావేశమై కార్యక్రమాలు రూపొందించాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి’’అని సూచించారు. జిల్లాల్లో అవసరాలు తీర్చడం కోసం ప్రతి కలెక్టర్‌కు రూ.2 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రతులను కలెక్టర్లకు సీఎం అందించారు.
జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం
జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం, ధరణి వెబ్ సైట్ ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాల వివరాలు పంపితే వెంటనే నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. స్టీల్, సిమెంట్‌తో పాటు ఇతర మెటీరియల్ ధరలు పెరిగినందున నిర్మాణ వ్యయం పెరుగుతోందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇతర నిర్మాణాల వ్యయం కూడా పెరిగినందున ధరల సవరణపై బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ సమావేశమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు.
మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రగతి లేదు
‘తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా నిలిచింది. 2017–18లో 19.84 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించింది. 2018–19లో 21 శాతం వచ్చే అవకాశం ఉంది. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత ప్రగతి లేదు. పెరిగిన సంపద ప్రజల బాగోగులకు వినియోగించాలి. భవిష్యత్ తరాలకు ఎంత సంపద ఇచ్చినా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుంటే అది వృథా. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంచడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్లు బాధ్యతతో నిర్వర్తించాలి.
గ్రామాల్లోని నర్సరీలను సందర్శించాలి. గ్రామాల్లో మొక్కలు పెంచే బాధ్యతలను సర్పంచులకు ఇస్తూ ఇటీవలే చట్టం కూడా తెచ్చాం. కొత్త చట్టం ప్రకారం ప్రతి పంచాయతీ, మునిసిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఇది గ్రామ కార్యదర్శి బాధ్యత. ఫారెస్ట్ రేంజ్ అధికారుల సహకారంతో నర్సరీలు నిర్వహించాలి. స్థానిక సంస్థలకు రూ. 2,500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాం. ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి కూడా రూ.3 లక్షల నిధులొస్తాయి. పెద్ద గ్రామాలకు రూ.25 లక్షలు వస్తాయి. ఇవి కాకుండా పన్నుల ద్వారా ఆదాయం, ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులొస్తాయి. వాటితో స్థానికంగా పనులు చేసుకోవాలి’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment