సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను ప్రారంభించాలంటే ఖర్చు భారీగానే ఉండబోతోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లేని 473 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన పరికరాలు, సర్వర్లు, నెట్‌వర్క్ ఏర్పాటు, సిబ్బంది వేతనాలు, రోజువారీ వ్యవహారాల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యవస్థ ఏర్పాటుకే రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
ఇవన్నీ అవసరం..!
రిజిస్ట్రేషన్ కార్యకలపాలకు అవసరమయ్యే సరంజామాతో పాటు మానవ వనరులను సమకూర్చే బాధ్యతను రాష్ట్ర టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)కు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగాలంటే అవసరమైన పరికరాల జాబితాను ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి పంపింది.
ప్రతి తహసీల్‌కు 4 కంప్యూటర్లు, స్కానర్, రెండు ప్రింటర్లు, 2 వేలిముద్రల నమోదు యంత్రాలు, 2 వెబ్‌క్యామ్‌లు, 1 వ్యాన్ ఆప్టిమైజర్, నెట్‌వర్క్ ర్యాక్, మోడెమ్, స్విచ్, 2 సీసీ కెమెరాలు, ఒక డిజిటల్ కెమెరా, డిస్‌ప్లే యూనిట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. ప్రతి తహసీల్ కార్యాలయంలో ఒక డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ (డీపీఓ), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)లు అవసరమవుతారని, దాదాపు వెయ్యి మంది సిబ్బంది కావాలని పేర్కొన్నారు.
ముందడుగు పడేనా..?
రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి సర్వర్లు, నెట్‌వర్క్ అనే రెండు సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే గచ్చిబౌలిలోని సర్వర్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. దీంతో పాటు రెయిల్‌టెల్ నెట్‌వర్క్‌ను ప్రతి రెవెన్యూ కార్యాలయానికి అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రతిపాదనలేవీ ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలోనే ఉన్న ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం మార్చి 12 నాటికి సాధ్యపడే అవకాశాలు కనిపించట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment