టీఐఐసీ స్థలాల్లోనూ క్రమబద్ధీకరణ
► సర్కారీ సంస్థలకిచ్చిన స్థలాల రెగ్యులరైజేషన్‌పై మల్లగుల్లాలు
► జీఓ 58ని అమలు చేసే అంశంపై ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన
► 696 దరఖాస్తులకు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వివిధ ప్రభుత్వ సంస్థలకు బదలాయించిన స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణపైసర్కారు ఎటూ తేల్చుకోలేకపోతోంది. జీఓ 58 కింద పేదలు తిష్టవేసిన స్థలాలను క్రమబద్ధీకరించే అంశంలో ఆయా శాఖల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం గతంలో టీఐసీసీ, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ, దేవాదాయ, అటవీశాఖలకు అప్పగించిన స్థలాల్లో కొంత విస్తీర్ణంలో నిర్మాణాలు వెలిశాయి.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణకు లైన్‌క్లియర్ చేయడంతో ఈ స్థలాల్లో నివసిస్తున్న కొందరు ఆక్రమణదారులు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ స్థలాలపై హక్కులున్న ఆయా శాఖలు క్రమబద్ధీకరణకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్థలాలను రెగ్యులరైజ్ చేయొద్దని విన్నవించాయి.
సీఎం ఆదేశాలతో..
వీలున్నంత మేరకు పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కోణంలోనే దరఖాస్తులను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలివ్వడంతో రెవెన్యూ యంత్రాంగం.. ఆయా శాఖలకు బదలాయించిన స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలోనూ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్థాయి అధికారులతో హైపవర్ కమిటీని నియమించింది. దీంట్లోభాగంగా బుధవారం సీసీఎల్ఏ నేతృత్వంలో అటవీ, టీఐఐసీ స్థలాల్లోని క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన జరిగింది.
ఏయే స్థలాలు క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయనే అంశంపై ఇంకా స్పష్టత రానప్పటికీ, దరఖాస్తుల్లో ఎక్కువమొత్తంలో ఆమోదముద్ర వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని వన్యప్రాణుల సంస్థ స్థలంలో 300 దరఖాస్తులు, బాలానగర్ మండలంలోని టీఐఐసీకి సంబంధించి అల్లావుద్ధీన్ కుట్టీలోని 350, చర్లపల్లి పారిశ్రామికవాడలోని 46 దరఖాస్తుల క్రమబద్ధీకరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దశాబ్ధాల క్రితమే ఇక్కడ నిర్మాణాలు వెలిశాయని, వాటిని తిరిగి తీసుకునే పరిస్థితి లేనందున రెగ్యులరైజ్ చేయడమే మేలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.