Regulation of land
-
ఇక కబ్జాదారులపై ‘పిడి’కిలి
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం కల్పించిన భూముల క్రమబద్ధీకరణ సదుపాయాన్ని వినియోగించుకోని వారిని కబ్జాదారులుగానే పరిగణిస్తాం. వారిపై రెవెన్యూ చట్టాలను ప్రయోగించి ఆక్రమిత భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం’’ అని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా స్పష్టం చేశా రు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కు సంబంధించిన పలు అంశాలను వివరిం చారు. జీవో 58 కింద ఉచిత కేటగిరీలో జనవరి 31తో, జీవో 59 కింద చెల్లింపు కేటగిరీలో ఫిబ్రవరి 28తో దరఖాస్తు ప్రక్రియ ముగిసిందన్నారు. వివిధ జిల్లాల నుంచి ఉచిత కేటగిరీలో మొత్తం 3,47,499, చెల్లింపు కేటగిరీలో 28,336 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తు దారులు రిజిస్ట్రేషన్(12.5శాతం) ధర కింద రూ.133.58కోట్లు చెల్లించారని చెప్పారు. ఇకపై దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. కబ్జాలను ఉపేక్షించం.. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. వీరిపై కఠినమైన రెవె న్యూ చ ట్టాలను(ల్యాండ్ ఆక్రమణల చట్టం 1905, ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్ 1982, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1986)లను ప్రయోగిస్తామన్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, అది పూర్తి కాగానే దరఖాస్తు చేసుకోని వారినుంచి భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. సొమ్ము చెల్లించిన భూమికే.. క్రమబద్ధీకరణకు సంబంధించి పేద వర్గాల కు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఉచిత కేటగిరీలో 125గజాల వరకు అసైన్మెంట్ పట్టాను ఇస్తామని బీఆర్ మీనా చెప్పారు. ఒకవేళ ద రఖాస్తులో పేర్కొన్న స్థలం 125గజాలకు పైగా 150గజాల్లోపు ఉన్నట్లైతే నిబంధనల ప్రకారం మిగిలిన భూమికి రిజిస్ట్రేషన్ ధరలో 10శాతం చెల్లించాలన్నారు. ఇటువంటి ప్రత్యేక కేసుల్లో.. ఉచితంగా క్రమబద్ధీకరించే స్థలానికి అసైన్మెంట్ పట్టా ఇస్తామని, సొమ్ము చెల్లించిన మేర స్థలానికే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో హక్కు బదిలీ చేస్తామన్నారు. -
మరో చాన్స్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మెట్టు దిగింది. క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించుకోవడానికి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. దరఖాస్తుల సమర్పణకు సోమవారం వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ఆక్రమణదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లోని కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా జిల్లా నుంచి ఖజానాకు భారీగా రాబడి సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అదేవిధంగా నగర శివార్లలోని విలువైన భూముల క్రమబద్ధీకరణతో వేల కోట్ల ఆదాయం వస్తుందని కూడా లెక్కగట్టింది. ఈ క్రమంలోనే 2014 కనీస ధరను నిర్దేశించింది. ఈ నిర్ణయమే సర్కారు అంచనాలు తలకిందులయ్యేందుకు కారణమైంది. బహిరంగ మార్కెట్ ధరకంటే ఎక్కువగా ఉన్న కనీస ధరను ప్రామాణికంగా తీసుకోవడం, యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణలో రూపొందించిన మార్గదర్శకాలు లోపబూయిష్టంగా ఉండడంతో ప్రభుత్వం లెక్కలు తప్పాయి. యూఎల్సీ ఖాళీ స్థలాలను రెగ్యూలరైజ్ చేయకుండా.. నిర్మాణాలుంటేనే క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా గుర్తిస్తామని స్పష్టంచేయడంతో దరఖాస్తుదారులు ముందుకురాలేదు. సోమవారం నాటికీ జిల్లావ్యాప్తంగా 1,17,083 దరఖాస్తులు రాగా, ఇందులో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల(బీపీఎల్)కు చెందిన దరఖాస్తులు 1,14,854 ఉన్నాయి. 125 చదరపు గజాల విస్తీర్ణంలో నివసిస్తున్న పేదల ఇళ్లకు ఉచితంగా పట్టాలివ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ కేటగిరీలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆదాయం రూ.23.30 కోట్లు మాత్రమే! క్రమబద్ధీకరణ కాసుల వర్షం కురిపిస్తుందని భావించిన జిల్లా యంత్రాంగానికి ఇప్పటివరకు సమకూరింది రూ.23.20 కోట్లు మాత్రమే. 125 గజాల పైబడిన కేటగిరీలోని నిర్మాణాలకు కనీస ధరలో 25శాతం దరఖాస్తుతోపాటే చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. దీంతో ఈ శ్రేణిలో 2,229 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో అత్యధికంగా మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ మండలాల నుంచి వచ్చాయి. మల్కాజిగిరి మండల పరిధిలో 1,130 దరఖాస్తులు ఈ కేటగిరీలో రాగా, బీపీఎల్ పరిధిలో ఇక్కడి నుంచే ఎక్కువగా రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జీఓ 58 పరిధిలోని 125 గజాల్లోపు దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31వ తేదీని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక జీఓ 59 పరిధిలోకి వచ్చే యూఎల్సీ, 125 గజాలపైబడిన నిర్మాణాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఫిబ్రవరి 28 వరకు స్వీకరించాలని సోమవారం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో నిబంధనల సడలింపుపై కూడా చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
కబ్జా భూముల క్రమబద్ధీకరణ!
ఇదివరకే నిర్మాణాలున్న భూములను గుర్తించేందుకు సర్కార్ కసరత్తు భూముల క్రమబద్ధీకరణ, విక్రయంతో ఖజానా నింపే యత్నం భూముల విక్రయంతో రూ.6,500 కోట్ల రాబడికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ చేసే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయంతో రూ.6500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దీన్ని బడ్జెట్లోనూ పొందుపర్చింది. అయితే ఇప్పటికిప్పుడు కొత్త భూములను వేలం వేయడం వల్ల.. ఆశిం చిన ఆదాయం వచ్చే అవకాశం లేదన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన స్థలాలైతే క్రమబద్ధీకరణతో బడ్జెట్లో పేర్కొన్న మేరకు కాకపోయినా.. కొంతమేరకు ఆదాయం సమకూరుతుందన్న అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై ఆక్రమణలకు గురైన భూములను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు వివరించారు. హైదరాబాద్ పరిసరాల్లోనే పెద్దఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయం విదితమే. అనుమతి లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిర్మాణాలు భారీగా కొనసాగినట్లు ప్రభుత్వం భావిస్తోంది, గురుకుల్ ట్రస్ట్ భూములు, అస్సైన్డ్ భూములు, నగరం చుట్టూరా ఉన్న ప్రభుత్వ భూములు పెద్దసంఖ్యలో అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అయితే దీనికి గతంలో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలా.. లేక మరే విధంగా ముందుకు సాగాలా? అన్న దానిపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. అలాగే అర్బన్ల్యాండ్ సీలింగ్ భూములను కొనుగోలు చేసిన వారికి కూడా ఆ భూములను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇప్పటికిప్పుడు విక్రయించడం వల్ల ఆశించిన మేరకు ఆదాయం సమకూరదనే అభిప్రాయంలో అధికారులు కూడా ఉన్నారు. హుడాకు అప్పగించిన భూములను కూడా విక్రయించాలని నిర్ణయించింది. భూముల విక్రయంలో ఎంత చేసినా రూ.6500 కోట్ల నిధులు ఖజానాకు జమ చేయడం సాధ్యమయ్యేది కాద న్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. అయి తే ఒక ప్రయత్నం చేస్తున్నామని, ఎంతవరకు సఫలీకృతం అవుతామన్నది చూడాల్సిన అవసరం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.