మరో చాన్స్ | Another Chance for Regulation land | Sakshi
Sakshi News home page

మరో చాన్స్

Published Tue, Jan 20 2015 12:47 AM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM

మరో చాన్స్ - Sakshi

మరో చాన్స్

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మెట్టు దిగింది. క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించుకోవడానికి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. దరఖాస్తుల సమర్పణకు సోమవారం వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ఆక్రమణదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించింది.

ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లోని కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా జిల్లా నుంచి ఖజానాకు భారీగా రాబడి సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అదేవిధంగా నగర శివార్లలోని విలువైన భూముల  క్రమబద్ధీకరణతో వేల కోట్ల ఆదాయం వస్తుందని కూడా లెక్కగట్టింది. ఈ క్రమంలోనే 2014 కనీస ధరను నిర్దేశించింది. ఈ నిర్ణయమే సర్కారు అంచనాలు తలకిందులయ్యేందుకు కారణమైంది. బహిరంగ మార్కెట్ ధరకంటే ఎక్కువగా ఉన్న కనీస ధరను ప్రామాణికంగా తీసుకోవడం, యూఎల్‌సీ స్థలాల క్రమబద్ధీకరణలో రూపొందించిన మార్గదర్శకాలు లోపబూయిష్టంగా ఉండడంతో ప్రభుత్వం లెక్కలు తప్పాయి.

యూఎల్‌సీ ఖాళీ స్థలాలను రెగ్యూలరైజ్ చేయకుండా.. నిర్మాణాలుంటేనే క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా గుర్తిస్తామని స్పష్టంచేయడంతో దరఖాస్తుదారులు ముందుకురాలేదు. సోమవారం నాటికీ జిల్లావ్యాప్తంగా 1,17,083 దరఖాస్తులు రాగా, ఇందులో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల(బీపీఎల్)కు చెందిన దరఖాస్తులు 1,14,854 ఉన్నాయి. 125 చదరపు గజాల విస్తీర్ణంలో నివసిస్తున్న పేదల ఇళ్లకు ఉచితంగా పట్టాలివ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ కేటగిరీలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.
 
ఆదాయం రూ.23.30 కోట్లు మాత్రమే!
క్రమబద్ధీకరణ కాసుల వర్షం కురిపిస్తుందని భావించిన జిల్లా యంత్రాంగానికి ఇప్పటివరకు సమకూరింది రూ.23.20 కోట్లు మాత్రమే. 125 గజాల పైబడిన కేటగిరీలోని నిర్మాణాలకు కనీస ధరలో 25శాతం దరఖాస్తుతోపాటే చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. దీంతో ఈ శ్రేణిలో 2,229 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో అత్యధికంగా మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ మండలాల నుంచి వచ్చాయి. మల్కాజిగిరి మండల పరిధిలో 1,130 దరఖాస్తులు ఈ కేటగిరీలో రాగా, బీపీఎల్ పరిధిలో ఇక్కడి నుంచే ఎక్కువగా రావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో జీఓ 58 పరిధిలోని 125 గజాల్లోపు దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31వ తేదీని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక జీఓ 59 పరిధిలోకి వచ్చే యూఎల్‌సీ, 125 గజాలపైబడిన నిర్మాణాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఫిబ్రవరి 28 వరకు స్వీకరించాలని సోమవారం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో నిబంధనల సడలింపుపై కూడా చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement