తోడేస్తున్నారు
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక తోడేస్తూ కోట్లు దండుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌శాఖ అండదండలతో వీరి దందా యథేచ్ఛగా సాగుతోంది. సామ, దాన, భేద, దండోపాయాలతో అధికారులను మచ్చిక చేసుకుని తమ దందాకు రాచబాటలు వేసుకుంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లతో నడుస్తున్న క్వారీలతో పాటు అనధికారిక క్వారీలు ఈ దందాకు అడ్డాలయ్యాయి. రాత్రీ పగలనే తేడా లేకుండా 24 గంటలపాటు ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.
- నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు
- ప్రభుత్వాదాయానికి గండి
- వేబిల్లు ఒకటే.. లారీలు ఐదు
- అధికారులకు ‘మామూలే’
- కళ్లు మూసుకుంటున్న వైనం
మానేరు, గోదావరి, మోయతుమ్మెద వాగుల ఇసుక నాణ్యతకు పెట్టింది పేరు. ఇక్కడి ఇసుకకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం నుంచి ఇచ్చంపల్లి వరకు 250 కిలోమీటర్ల దూరం గోదావరి, గంభీరావుపేట మండలం నుంచి మంథని మండలం ఆరెంద వరకు 150 కిలోమీటర్ల మేర మానేరు నది ప్రవహిస్తుంది. జిల్లాలోని మానేరు వాగుపై ప్రభుత్వం మూడు ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చింది. కరీంనగర్ మండలం ఖాజీపూర్ వద్ద, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద, వేములవాడ మండలం సంకెపల్లి వద్ద ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయిస్తున్నారు.
మూడు క్వారీల నుంచి ప్రతి రోజు 700 పైగా లారీల్లో ఇసుక తరలిపోతోంది. అధికారికంగా నిర్వహిస్తున్న మూడు క్వారీలే కాకుండా జిల్లాలో 12 ప్రాంతాల నుంచి ఇసుక తరలిపోతోంది. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సమాచారం ఉన్నా ‘మామూలు’గానే వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక తీయాల్సి ఉండగా, రాత్రీ పగలనే తేడా లేకుండా 24 గంటలపాటు అక్రమ రవాణా సాగుతోంది.