65 నామినేషన్లుతిరస్కరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో అంకం ముగిసింది. గురువారం నాటితో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు బుధవారం నాటికి నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. 14 అసెంబ్లీ స్థానాలకు 421 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గురువారం చేపట్టిన పరిశీలనలో 61 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. దీంతో బరిలో 360 మంది అభ్యర్థులు నిలిచారు. రెండు పార్లమెంటు స్థానాలకు 52 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పరిశీలన ప్రక్రియలో నలుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో చివరకు పోటీలో 48 మంది ఉన్నారు.
ఎల్బీనగర్లో అధికంగా
అసెంబ్లీ నియోజకవర్గ కేటగిరీలో ఎల్బీనగర్ సెగ్మెంట్ నుంచి అధికంగా 13 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాత మల్కాజిగిరి సెగ్మెంట్ నుంచి 11 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి ఒక్కో అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు.
అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లు దరఖాస్తు సమయంలో బలపర్చే అభ్యర్థుల సంఖ్య అవసరం మేరకు లేకపోవడం, పలు వివరాలు సమర్పించకపోవడంతోనే వాటిని తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తిరస్కరణపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వారంతా పోటీ నుంచి దాదాపు నిష్ర్కమించినట్లే. ఇదిలాఉండగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో పూర్తికానుంది.