67 లక్షల మందికి రేషన్ కట్: పరకాల
హైదరాబాద్: ఏపీలో 67 లక్షల మంది తెల్లకార్డుదారులకు రేషన్ నిలిపేస్తున్నట్లు ప్రభుత్వ సలహా దారు పరకాల ప్రభాకర్ బుధవారం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్‌కార్డుల్ని ఆధార్‌తో సరిపోల్చి చూసే ప్రక్రియ 98 శాతం వరకు పూర్తయిందని, ఫోటోలు, చిరునామాలు సరిపోలక 67 లక్షల తెల్లకార్డులు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ముఖ్యమైన సంస్కరణలు తెచ్చేందుకు చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయించిందని తెలిపారు. దీన్లో భాగంగా పారదర్శకత కోసం, బోగస్, దుబారా అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 27,176 ఈ-పాస్ మిషన్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రెండు నెలల్లో ఈ మిషన్ల ద్వారా ఈ-పాస్ కార్డులు జారీ చేసి రేషన్ సరుకులు అందించనున్నట్లు వివరించారు.
ఎమ్మెల్యే తండ్రి పింఛను పొందడాన్ని.. సమర్ధిస్తున్నారా?
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి పేరిట తెల్ల రేషన్‌కార్డు (ఏపీ 102600500742) ఉందని, పింఛను కూడా పొందడాన్ని తనిఖీ సభ్యులు గుర్తించారని పరకాల ప్రభా కర్ అన్నారు. ఆర్ధికంగా స్థితిమంతుడైన ఎమ్మెల్యే తండ్రి పింఛను పొందడాన్ని ప్రతిపక్ష నేత సమర్ధిస్తారా? అని పరకాల ప్రశ్నించారు.