శ్రీవారి దర్శనానికి 25 గంటలు
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము న 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 49,374 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 25 గంటలు, 13 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 18 గంట ల తర్వాత దర్శనం లభించనుంది. గదుల కోసం భక్తులు అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ క్యూ కట్టారు. తలనీలాలు సమర్పించుకునేందుకు మూడు గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముగిసిన వేదపారాయణం: లోకకల్యాణం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన అద్భుత శాంతి వేదపారాయణం ఆదివారం ముగిసింది. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపంలో ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పండితులు, టీటీడీ వేద పాఠశాల విద్యార్థులు వేదపారాయణం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ. రమణ దీక్షితులు, ఆగమ సలహాదారులు ఏకే. సుందరవరదన్, మోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో ఈ వేదపారాయణం నిర్వహించారు. - తిరుమల, సాక్షి