తండ్రికిచ్చిన మాట కోసం.. సినీ పరిశ్రమకు దూరం
తాడేపల్లిగూడెం: ప్రముఖ సినీ హాస్యనటుడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య ఏకైక వారసుడు సత్యనారాయణ బాబు (75) కన్నుమూశారు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం ఆయన భౌతిక కాయానికి హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య కుసుమకుమారి, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణబాబు మృతితో తాడేపల్లిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నటన కలగానే మిగిలింది.
బాల్యం నుంచి సత్యనారాయణ బాబుకు నటనంటే అమితాసక్తి. మద్రాసులో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌కందాతో కలసి సత్యనారాయణ బాబు సినిమాలో నటించారు. నాటకాలలో ప్రవేశమున్న బాబు మూడుసార్లు ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్నారు. నగేశ్ లాంటి మంచి కమెడియన్ కావాలనేది ఆయన కోరిక.
బాలానందం అనే సినిమాలో హీరో, విలన్‌గా బాబు నటించారు. చట్టాలు మారాలి అనే తెలుగు సినిమాను తమిళంలోకి డబ్బింగ్ చేసి నిర్మాతగా కూడా అవతారమెత్తారు. అనంతరం సినీ రంగాన్ని వీడిన 75 ఏళ్ల వయసులోను తనలో ఉన్న నటనా ఆసక్తిని వదులుకోలేక, తన చిన్న కుమారుడు హేమంత్‌కు నటనలో శిక్షణ ఇప్పించారు. హేమంత్‌ను నటునిగా చూడాలని, గూడెంలో ఉన్న రేలంగి చిత్రమందిర్‌ను మల్లీఫ్లెక్సుగా తీర్చిదిద్దాలని ఆయన కన్న కలలు నెరవేరకుండానే దివికేగారు. బాబు పెద్దఅల్లుడు మెదక్ జిల్లా సదాశివపేట చైర్మన్‌గా పనిచేశారు. కొడుకులు ఇద్దరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు.
తండ్రి మాట కోసం..
నవ్వుల రేడు రేలంగి తనయుడు కావడంతో ఆ రోజుల్లోనే సత్యనారాయణ బాబుకు నాయకునిగా, ప్రతినాయకునిగా, హాస్యనటునిగా అనేక అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని సినిమాల్లో నటించినా ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయారు. తండ్రి జీవితంలో నేర్చుకున్న పాఠాలసారం నుంచి గ్రహించిన అనుభవంతో చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటించి, రేలంగి మెచ్చిన రాముడిలా బాబు జీవితకాలం మెలిగారు.
చెన్నపట్నాన్ని వదిలి తాడేపల్లిగూడెంలో ఉంటూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు. గూడెంలో తండ్రి నిర్మించిన రేలంగి చిత్రమందిర్ బాధ్యతలను చూసుకుంటూ సత్యనారాయణ బాబు ఇక్కడే ఉండిపోయారు. అనంతరం ఆయన కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డా, ఎక్కువ కాలం గూడెంలో థియేటర్ వెనుక ఉన్న గెస్ట్‌హౌస్‌లోనే ఉండేవారు. తన కుటుంబానికి గుర్తింపునిచ్చిన గూడెంలో ఉండటానికే మక్కువ చూపేవారు.