కోపగించుకున్న కోహ్లి
ముంబై: తన ప్రేమాయణంపై అడిగిన ప్రశ్నకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తానేమీ రిలేషన్ షిప్ కౌన్సిలర్ ను కాదంటూ చురక అంటించాడు. లగ్జరీ వాచీలు తయారుచేసే టిస్సాట్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన కోహ్లి మంగళవారం ఆ కంపెనీ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
అనుష్క శర్మతో బ్రేక్ అప్ గురించి ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా తెలివిగా సమాధానం ఇచ్చాడు. 'ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నానో చెప్పేందుకు నేను రిలేషన్ షిప్ కౌన్సిలర్ ను కాదు. కాబట్టి ఈ ప్రశ్న నన్ను అడగకూడదు. దయచేసి ఎక్స్ ఫర్ట్ ని సంప్రదించండి' అని కోహ్లి జవాబిచ్చాడు.
మీకు బహుమతిగా వచ్చిన లగ్జరీ వాచీని బాలీవుడ్ లో ఎవరికి ఇస్తారని అడగ్గా.. ఇదేం ప్రశ్న అని చిర్రుబుర్రు లాడాడు. మరో కోణంలో ప్రశ్నలు అడిగేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాడు. ఆ వాచీని తన కుటుంబ సభ్యులకో.. సహచర క్రికెటర్లకో కానుకగా ఇస్తానని చెప్పాడు. అయినా ఎవరిస్తే మీకెందుకు అని ఎదురు ప్రశ్నించాడు.