అప్పుడది దేవుడు లేని గుడితో సమానం!
‘‘ఏ సినిమానైనా గ్రాఫిక్స్ లేకుండా తీయొచ్చు. కానీ, ఒకప్పుడు కన్నీళ్లున్న సినిమాలు చూసిన జనం ఇప్పుడు ‘అవతార్’, ‘టైటానిక్’లు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు మంచి కథతో పాటు అదనపు హంగులు (గ్రాఫిక్స్) కోరుకుంటున్నాడు. అందుకే టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పు డు అప్డేట్ అవుతుంటాను’’ అని కోడి రామకృష్ణ అన్నారు. ‘అమ్మోరు’, ‘అంజి’, ‘అరుంధతి’ సినిమాలతో గ్రాఫిక్స్ పరంగా టాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుడీయన.
ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నాగభరణం’ ఈ నెల 14న విడుదల కానుంది. సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించిన ఈ సినిమాలో రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ - ‘‘ఓ పాము కథ ఇది. గత జన్మలో తీరని కోరికలను ఈ జన్మలో ఎలా తీర్చుకుందనేది సినిమా. తన ఆశయాన్ని సాధించలేని స్థితిలో ఆమె ఆరాధ్య దైవం శివుడు ఓ శక్తిని సృష్టించి పంపిస్తాడు. ఆ శక్తి విష్ణువర్ధన్ పాత్ర రూపంలో వస్తుంది. ఆ ఐడియా నిర్మాత సాజీద్దే. గ్రాఫిక్స్ లేకుండా ఈ సినిమా తీయాలనుకున్నా.
మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో సాజీద్ ఖర్చుకు వెనుకాడలేదు. గ్రాఫిక్స్ పేరుతో ఎంత ఖర్చుపెట్టినా నిర్మాతకు నష్టం కలగకుండా దర్శకుడు మినిమమ్ గ్యారెంటీ చూసుకోవాలి. మనం ఏం తీస్తున్నామనేది కూడా దర్శక-నిర్మాతలకు అవగాహన ఉండాలి. నిర్మాత సెట్లో లేకపోతే అది దేవుడి లేని గుడితో సమానం. నా విజయాలకు కారణం నిర్మాతలే. ఇప్పటివరకూ నా సినిమాలన్నీ మిగతా భాషల్లో అనువాదమయ్యాయి. కన్నడలో తీసిన ఈ సినిమా తెలుగులో అనువాదమైంది. మల్కాపురం శివకుమార్ 600 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అన్నారు. త్వరలో మా అమ్మాయి దీపు దర్శకురాలిగా పరిచయం కానుందని చెప్పారాయన.