నిధులిచ్చినా నిర్లక్ష్యమే..
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై ఉదాసీనత
పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో అలక్ష్యం
దొడ్లను శుభ్రం చేసేది వారానికి ఒకసారే..
అమలాపురం టౌన్ :పాఠశాలల్లోని మరుగుదొడ్లను పరిశుభ్రం చేయించాలంటే ఎదురు పెట్టుబడి పెట్టే పరిస్థితి గతంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఉండేది. మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేకించి నిధుల మంజూరు లేకపోవటంతో అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఉండేవి. అసలే మరుగుదొడ్ల కొరత, ఆపై అపరిశుభ్రత.. దీంతో విద్యార్థులు.. ముఖ్యంగా బాలికలు కాలకృత్యాల విషయంలో నిత్యం నానా యాతనలకు గురయ్యేవారు. ఇదంతా గతం. ఈ సమస్యపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది. సర్వశిక్షాభియాన్ నుంచి కేవలం పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ గత సంవత్సరం నవంబరులో ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి ఆరు నెలల కాలానికి సరిపడేలా నిర్దేశించిన నిధులను కూడా పాఠశాలల విద్యా కమిటీలకు జమ చేసింది. జిల్లాలో 60 మంది విద్యార్థులు దాటిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు గత నవంబరులోనే ఆరు నెలలకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. అయితే నిధులిచ్చినా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణలో అదే నిర్లక్ష్యం, అదే అశ్రద్ధ కొనసాగుతున్నాయి. దొడ్లలో అదే అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇచ్చిన నిధులతో ఆయా పాఠశాలలు ఓ పారిశుద్ధ్య కార్మికులను నియమించుకుని నెలా నెలా జీతం ఇచ్చుకుని రోజూ మరుగుదొడ్లను పరిశుభ్రం చేయించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ అధిక శాతం పాఠశాలల్లో నియామకాలే జరగలేదు.
ఇవీ మార్గదర్శకాలు..
మరుగుదొడ్ల నిర్వహణకు 60 మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు నెలకు రూ. వెయ్యి, 100 మంది దాటిన పాఠశాలకు రూ.1500, 150 మంది దాటిన పాఠశాలకు రూ.2500 వంతున నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో పారిశుధ్య కార్మికుని నియమించుకుని రోజుకు మరుగుదొడ్లను అయిదుసార్లు పరిశుభ్రం చేయించాల్సి ఉంది. అయితే జిల్లాలో అధిక శాతం పాఠశాలలు మరుగుదొడ్లను వారానికోసారే పరిశుభ్రం చేయిస్తున్నాయి. అమలాపురంలోని అయిదు ఉన్నత పాఠశాలలు కూడా వారానికోసారి మాత్రమే పరిశుభ్రం చేయిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఎంఈఓలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చినా ఇంకా అలక్ష్యం వీడలేదు.
నియామకాల్లో రాజకీయ జోక్యం
నిధులను పాఠశాల విద్యా కమిటీలు పర్యవేక్షించాలని, పారిశుద్ధ్య కార్మికుల ఎంపిక కూడా కమిటీలే చేపట్టాలని మార్గదర్శకాల్లో ఉంది. విద్యా కమిటీల్లో పలుచోట్ల గ్రామస్థాయి రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలాంటి చోట్ల పారిశుద్ధ్య కార్మికుని నియామకంలో రాజకీయ జోక్యం ఉంటోంది. దీంతో కొందరు ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో చొరవ చూపలేకపోతున్నారు. అమలాపురంలోని మూడు పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎంఈఓలు చొరవ తీసుకుంటేనే మరుగుదొడ్ల నిర్వహణకు నిర్దేశించిన నిధులు అక్కరకు వస్తాయి.