ఢిల్లీ సీబీఐ కోర్టుకు అనీల్ అంబానీ
న్యూఢిల్లీ : 2జీ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రిలియన్స్ అడాగ్ అధ్యక్షుడు అనిల్ అంబానీ గురువారం ఉదయం సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. సీబీఐ కోర్టు ముందు ఆయన సాక్షిగా హాజరు అవుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రాసిక్యూషన్ సాక్షులుగా రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీ.. ఆయన భార్య టీనా అంబానీలను 2జీ స్పెక్ట్రమ్ కేసులో సాక్షులుగా హాజరు కావాలని సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే.
అనిల్ హాజరుకు సంబంధించిన మధ్యంతర ఆర్డరు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించడంతో అనిల్ హాజరు అనివార్యంగా మారింది. అనిల్ సిబిఐ కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రిలయన్స్ టెలికాం లిమిటెడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే జస్టిస్ జిఎస్ సింఘ్వి సారధ్యంలోని బెంచ్ ఈ విషయంలో కల్పించుకునేందుకు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో అనిల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అనిల్తోపాటు ఆయన భార్య టీనా అంబానీ విచారణను వాయిదా వేయాలని కోరారు. అయితే న్యాయస్థానంలో వారికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. దాంతో అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ కూడా శుక్రవారం సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు.